లాటరీ పేరుతో భారీ మోసం: ఫేస్ బుక్ లింక్ ను క్లిక్ చేసి రూ. 7 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు

కామారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. జిల్లాలోని బిక్కనూర్ లో లాటరీ పేరిట వచ్చిన లింక్ ను క్లిక్ చేసి రూ. 7లక్షలు కోల్పోయాడు ఓ బాధితుడు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్ బుక్ చూస్తుండగా... లాటరీ యాడ్ కనబడడంతో లింక్ ను క్లిక్ చేశాడు. ఆ తర్వాత 60 లక్షల నగదు,10 తులాల బంగారం లాటరీలో గెలుపొందారని బాధితుడికి వాట్సాప్ కాల్ చేశారు సైబర్ కేటుగాళ్లు.

ట్యాక్స్ ల కోసం కొంత నగదును పంపాలంటూ బాధితుడిని నమ్మించారు కేటుగాళ్లు. దీంతో అవతలి వ్యక్తుల మాటలు నమ్మీ విడతల వారీగా కలిపి ఆన్ లైన్ అకౌంట్ ద్వారా రూ. 7.20 లక్షలు చెల్లించాడు బాధితుడు. ఆ తర్వాత ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు బాధితుడు. 

Also Read :- ఢిల్లీలో స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపు

బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన భిక్కనూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అత్యాశకు పోయి ఫేస్ బుక్, వాట్సాప్ లో వచ్చే లింకులు క్లిక్ చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.