కాళేశ్వరం డిజైన్లకు సీడబ్ల్యూసీ అనుమతుల్లేవ్ : వెదిరె శ్రీరామ్​ స్పష్టం

  • తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని అప్పటి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారు
  • కాళేశ్వరం కమిషన్​కు వివరించిన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్
  • వివరించిన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్
  • బ్యారేజీల లొకేషన్ల మార్పుపై నిర్ణయం కూడా కేసీఆర్​దే
  • రాజకీయ కారణాలతో మేడిగడ్డకు లొకేషన్​ మార్చి ఉండొచ్చు
  • ఇన్వెస్టిగేషన్​ స్టడీస్​, డిజైన్స్​, మోడల్స్​పై ఓ పద్ధతి ఫాలో కాలేదు
  • సరైన ఓఅండ్ఎం లేకపోవడమూ బ్యారేజీలు కుంగడానికి ఓ కారణం
  • మేడిగడ్డలాగే మిగతా రెండు బ్యారేజీలు కుంగిపోవచ్చని వ్యాఖ్య
  • కాళేశ్వరం ప్రాజెక్ట్​తో నాకు సంబంధం లేదు: స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ వికాస్​ రాజ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లకు సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) అనుమతుల్లేవని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్​ స్పష్టం చేశారు. ఇరిగేషన్​ శాఖలోని సెంట్రల్​ డిజైన్స్​ ఆర్గనైజేషన్​ (సీడీవో) సీఈ ఇచ్చిన డిజైన్లకు ఆమోదం రాలేదని తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ ఓపెన్​ కోర్టు విచారణకు వెదిరె శ్రీరామ్​ హాజరయ్యారు. ‘‘ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చింది ఎవరు? దానిపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నది ఎవరు?’’ అని కమిషన్​ ప్రశ్నించింది. 

అప్పటి సీఎం బ్యారేజీ లొకేషన్​ను మార్చారని శ్రీరామ్  చెప్పారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బ్యారేజీ సైట్​ను మార్చామని అప్పటి సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వాస్తవానికి 75% డిపెండబిలిటీ (ఓ వాటర్​ ఇయర్​లో వచ్చే సగటు వరద) ఆధారంగా 165 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందంటూ 2015లో సీడబ్ల్యూసీ చెప్పిందని, కానీ, సైట్​ మార్చాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఆ నెపాన్ని సీడబ్ల్యూసీపైకి నెట్టిందని పేర్కొన్నారు. 

దాంతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్రవైపు 4,200 ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నదని, అందుకే ప్రాజెక్ట్​ సైట్​ను మారుస్తున్నామని చెప్పడం అర్థరహితమని వెల్లడించారు.  ప్రాజెక్ట్​ సైట్​ మార్చడం వెనుక రాజకీయ కారణాలు లేదా   ఏవైనా ఉండి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

కడుతున్నప్పుడూ డిజైన్ల మార్పు

మేడిగడ్డ బ్యారేజీలో లోపాలేంటి? అని వెదిరె శ్రీరామ్​ను కమిషన్​ ప్రశ్నించింది. ఏ ప్రాజెక్టుకైనా కనీస టెస్టులు చేయాల్సి ఉంటుందని, కానీ, 3 బ్యారేజీల విషయంలో వాటిని సరిగ్గా ఫాలో కాలేదని వెదిరె శ్రీరామ్​ చెప్పారు. ఇన్వెస్టిగేషన్​ స్టడీస్​, డిజైన్స్​, మోడల్స్​పై ఓ పద్ధతి ఫాలో కాలేదని వెల్లడించారు.  బ్యారేజీల నిర్మాణ సమయంలోనూ డిజైన్లు పదే పదే మార్చారని వివరించారు. 

Also Read :- భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఓ క్రమ పద్ధతి లేకుండా నిర్మాణం చేయడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తెలిపారు. బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్​ను కూడా పట్టించుకోలేదని తెలిపారు.  అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని, భవిష్యత్తులో ఈ బ్యారేజీలకూ ప్రమాదమే పొంచి ఉందని చెప్పారు.

ఓ అండ్​ ఎంపై నిధులు ఖర్చు చేయలే..

బ్యారేజీలను ప్రారంభించాక వాటి పరిరక్షణకు కనీస చర్యలు చేపట్టలేదని వెదిరె శ్రీరామ్​ చెప్పారు. బ్యారేజీల్లో 2019లో తొలిసారి సమస్యలను గుర్తించినప్పుడు ఏజెన్సీలకు ఓ అండ్​ఎంకు సంబంధించిన అంశాల గురించి చెప్పినా చర్యలు మాత్రం తీసుకోలేదని స్పష్టం చేశారు.  సరైన టెస్టులు చేయకుండానే సీడీవో డిపార్ట్​మెంట్​ బ్యారేజీల డిజైన్లను ఇచ్చిందని తెలిపారు. 

మేడిగడ్డ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు రావడం వంటి ఘటనలు జరిగాక.. ఎన్​డీఎస్​ఏ చేసిన సూచనలను పాటించడంలో ఓ అండ్ఎం ఈఎన్సీ నిర్లక్ష్యం చేశారా? అని కమిషన్​ ప్రశ్నించింది. సమస్య తలెత్తగానే ఎన్​డీఎస్​ఏ నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించిందని, 20 రకాల పరీక్షలు చేయాల్సిందిగా సూచించిందని  శ్రీరామ్​ చెప్పారు. ఆ టెస్టులు చేయడంలో ఓ అండ్​ ఎం విభాగం చాలా ఆలస్యం చేసిందన్నారు. 

రుణాల సమీకరణకే కార్పొరేషన్​లా ఉంది

రుణ సమీకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్​  ఏర్పా టు చేసినట్టు కనిపిస్తున్నదని వెదిరె శ్రీరామ్​ అన్నారు. కార్పొరేట్​ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు లోన్లు తీసుకున్నారని, అయితే, ప్రాజెక్ట్​ నుంచి వస్తున్న ఫలాలు మాత్రం శూన్యమని తెలిపారు. కాగా, వెదిరె శ్రీరామ్​ తన అఫిడవిట్​లో పేర్కొన్న సీడబ్ల్యూసీ నుంచి తీసుకున్న సీఈ సీడీవో లెటర్​కు, అధికారులు ఇచ్చిన లేఖకు తేడా ఉండడంతో ఇదేంటని కమిషన్​ ప్రశ్నించింది.

  తాను ఆ లెటర్​ను నేరుగా సీడబ్ల్యూసీ నుంచే తీసుకున్నానని, తేడాలు ఎందుకున్నాయో తెలియదని వెదిరె శ్రీరామ్​ బదులిచ్చారు. సీడబ్ల్యూసీకి లెటర్​/నోటీస్​ ఇచ్చాకే ఆ లెటర్​ను పొందారా? అని కమిషన్​ ప్రశ్నించింది. తాను జలశక్తి సలహాదారుగా పనిచేస్తున్నానని, కాళేశ్వరానికి సంబంధించిన పలు మీటింగ్స్​లో పాల్గొన్నానని, ఆ హోదాలోనే సీడబ్ల్యూసీ నుంచి లేఖ తీసుకున్నానని చెప్పారు. కాగా, కమిషన్​ ముందు  ఎమ్మెల్సీ కోదండరామ్ హాజరయ్యా రు. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్​పై కమిషన్​ అస హనం వ్యక్తంచేసింది. అసలు అది అఫిడవిట్టేనా? అని ప్రశ్నించింది. కోదండరామ్​ తర్వాత.. స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ వికాస్​ రాజ్​ (గతంలో 2016 నుంచి 2019 వరకు మైనర్​ ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ) ఓపెన్​ కోర్టుకు వచ్చారు.

ఆత్రం వల్లే నష్టం

బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశం లేదని, కేవలం డైవర్ట్​ చేసే స్ట్రక్చర్లేనని వెదిరె శ్రీరామ్​ చెప్పారు. బ్యారేజీల ప్లాన్లను రూపొందించడానికి ముందే నిర్మాణం ప్రారంభమైందా? లేదా టెండర్లు పిలిచి పనులు అప్పగించారా? అని కమిషన్​ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణం ప్రారంభమవడానికి ముందే 2016లో అప్పటి సీఎం దానిపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారని శ్రీరామ్​ చెప్పారు. 2019లోపే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని డెడ్​లైన్​ పెట్టారన్నారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ టైంలో బ్యారేజీలను పూర్తి చేయాలన్న ఆత్రంలో నిర్మాణాలు చేయడం వల్ల బ్యారేజీలకు నష్టం జరిగిందని  తేల్చి చెప్పారు.