యెస్ బ్యాంక్‌లో అకౌంట్ఉన్న కస్టమర్లు, ఆర్‌బీఐ తీసుకున్న చర్యలతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడేం ఏం చేయాలా? అని తలలు పట్టుకుంటున్నారు. యెస్ బ్యాంక్ కస్టమర్లు ఏం చేయాలి.. ఏం చేయకూడదో.. అనే విషయాలపై విశ్లేషకులు అవగాహన కల్పిస్తున్నారు.
- యెస్ బ్యాంక్ నుంచి రూ.50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదని ఆర్‌బీఐ చెప్పింది. ఇది సేవింగ్స్, డిపాజిట్స్, కరెంట్ అకౌంట్లన్నింటికీ వర్తిస్తుంది. ఏ లోన్‌ను రెన్యూ చేసుకోవడానికి వీలు లేదని కూడా ఆర్‌బీఐ చెప్పింది. బోర్డును కూడా రద్దు చేసి, కొత్త అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌బీఐ మాజీ సీఎఫ్‌ఓ ప్రశాంత్ కుమార్‌ను నియమించింది.
- అన్ని లావాదేవీలకు ఆర్‌బీఐ విధించిన ఈ పరిమితి వర్తిస్తుంది. రూ.50 వేల కంటే ఎక్కువ జరిపే పేమెంట్లలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
- శాలరీ అకౌంట్ కస్టమర్లు తమ మనీ క్రెడిట్ అయ్యేందుకు వేరే మార్గాలను చూసుకోవాలి.
- ఇన్వెస్టర్ల మనీని కాపాడేందుకు చాలా మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా యెస్ బ్యాంక్ అకౌంట్లలోకి వారి స్కీమ్‌ల రిడప్షన్ రిక్వెస్ట్‌లను అనుమతించడం లేదు. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు యెస్ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సొల్యుషన్స్ ఆఫీస్(క్యామ్స్) వద్ద మీ అకౌంట్‌ను మార్చుకునే రిక్వెస్ట్‌ను పెట్టుకోవాలి. క్యామ్స్ దేశంలో అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీ.
- మనదేశంలో చాలా ఏళ్ల తర్వాత ఒక ప్రైవేట్ బ్యాంక్ ఇలాంటి విషమ పరిస్థితులు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్‌లో ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు, 2003లో దీన్ని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో కలిపారు. 2010లో యునిటెడ్ వెస్ట్రన్ బ్యాంక్‌ను ఐడీబీఐ టేకోవర్ చేసింది. యెస్ బ్యాంక్‌లో ఉన్న అన్ని అకౌంట్ల ఒక్కో డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందనే విషయం తెలిసిందే.
