అరటిపళ్లు కొనడానికి వచ్చిన వ్యక్తి పండ్ల వ్యాపారి చెప్పిన రేటు నచ్చకపోవడంతో బేరసారాలు ఆడాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పండ్ల వ్యాపారి, అతని కొడుకుని కత్తితో పొడిచేసిన అమానుష ఘటన కడపలో చోటుచేసుకుంది. నగరంలోని బిస్మిల్లా నగర్‌కి చెందిన ఖాజావలి చిలకలబావి వద్ద అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అతని కొడుకు మస్తాన్ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో చెకుమార్ ఖాన్ అనే వ్యక్తి అరటి పండ్లు కొనేందుకు వచ్చి బేరమాడాడు. బేరం కుదరకపోవడంతో పండ్ల వ్యాపారి అరటిపండ్లను ఇవ్వడానికి తిరస్కరించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చెకుమార్‌ఖాన్ అరటిపళ్లు కోసే కత్తి తీసుకుని ఖాజావలి, అతని కొడుకు మస్తాన్‌ను పొడిచేశాడు.వెంటే స్పందించిన స్థానికులు బాధితులను రిమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
