నిజామాబాద్ జిల్లాలో రూ.708 కోట్ల వడ్లు మాయం.. 1.70 లక్షల టన్నుల ధాన్యం పక్కదారి

  • డిఫాల్ట్​ లిస్ట్​లో 42 మిల్లులు
  • 1.70 లక్షల టన్నుల ధాన్యం పక్కదారి
  • 21 మిల్లులపై క్రిమినల్​ కేసులు
  • ఆస్తుల జప్తుకు రెడీ అవుతున్న ఆఫీసర్లు 

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో కస్టం మిల్లింగ్​ రైస్​ పక్కదారి పట్టింది. ఆయా సీజన్లలో కొనుగోలు కేంద్రాల్లో  సేకరించిన ధాన్యాన్ని అధికారులు రైస్​మిల్లులకు అప్పగించారు. వడ్లను మిల్లింగ్​ చేసి  నిబంధనల ప్రకారం బియ్యాన్ని ​ఎస్​సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు చాలా కాలంగా పెండింగ్​లో పెట్టారు. ఇటీవల  మిల్లులను  తనిఖీ చేసిన అధికారులకు చాలాచోట్ల ధాన్యం స్టాక్​ కనిపించలేదు. 

Also Read:-తొక్కిసలాటకు నేను బాధ్యుడ్ని కాదు: హైకోర్టులో అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌

 2023–-24 వానా కాలం,యాసంగి సీజన్​లకు సంబంధించి  దాదాపు రూ. 708 కోట్ల విలువైన బియ్యం గాయబ్​ అయినట్లు గుర్తించారు. బియ్యం రికవరీకి చర్యలు ప్రారంభించిన అధికారులు.. అవసరమైతే ఆర్ఆర్​ యాక్టు ప్రయోగించి మిల్లర్లు ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధపడుతున్నారు.  

గడువులు పొడిగించినా..  నో రెస్పాన్స్​

జిల్లాలో మొత్తం 243 రైస్​ మిల్స్ ఉండగా, అందులో 182 రా రైసు మిల్లులు, 61 పారా బాయిల్డ్​ మిల్స్​ఉన్నాయి. ఈ మిల్లులకు   2023–-24 వానాకాలంలో 4.75 లక్షల మెట్రిక్​ టన్నులు, యాసంగిలో  లో 4.30 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని  సర్కారు అప్పగించింది.  రెండు సీజన్​లు కలిపి 6.25 టన్నుల బియ్యం గవర్నమెంట్​కు ఇవ్వాల్సిఉండగా  4.55 లక్షల టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా  1.70 లక్షల టన్నుల బకాయి ఉంది.  సీఎంఆర్​  రైస్ అప్పగించేందుకు  ప్రభుత్వం ఇచ్చిన గడువు చాలాసార్లు పొడిగించినా ఫలితం లేదు.  అక్టోబర్​ నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు గడువు పెంచారు.  తాజాగా విధించిన గడువు కూడా  ఈనెల 15న ముగుస్తోంది.  ఈసారి గడువు పొడిగింపు ఉండదని  ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నా మిల్లర్లు బకాయి పడిన రైస్​ను అప్పగించేందుకు  ముందుకురావడంలేదు.  

708 కోట్ల వడ్లు మాయం 

జిల్లాలోని 243 రైసు మిల్లుల్లో  42 మందిని  డిఫాల్టర్లుగా అధికారులు గుర్తించారు.  ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్​  టాస్క్​ఫోర్స్​ టీమ్స్​మిల్లుల్లో స్టాక్​ తనిఖీ చేశాయి.  బియ్యాన్ని అప్పగించకపోవడం, సెంటర్ల నుంచి తరలించిన వడ్లు లేకపోవడంతో సీరియస్​ అయ్యారు. 42 మంది మిల్లర్లు   సుమారు రూ.708 కోట్ల సీఎంఆర్​ వడ్లు మాయం చేసినట్టు అధికారులు లెక్క తేల్చారు.   వీరిలో  21 మందిపై క్రిమినల్​ కేసులు పెట్టారు. మిగిలిన 21 మందికి  ఫైనల్​ నోటీసు ఇచ్చారు.  

నిబంధనలు కఠినం

సీఎంఆర్​వంద శాతం రాబట్టే విషయంలో సీరియస్​గా ఉన్నం. కస్టం​ మిల్లింగ్​నిబంధనలను ప్రభుత్వం  కఠినతరం చేసింది.  డీఫాల్టర్​ లిస్టులో ఉన్నవాళ్లు బకాయి రైస్​ అప్పగించకుంటే వారికి  తిరిగి   వడ్లు కేటాయించం.  గడువులోగా బియ్యం ఇవ్వకుంటే  ఆర్​ఆర్​ యాక్ట్​ కింద తహసీల్దార్లు  చర్యలు తీసుకుంటారు. ఆస్తులు సీజ్​ చేసి  వేలం వేస్తం.   ఈ సీజన్​కు సంబంధించి ఎప్పటికప్పుడు సీఎంఆర్​ అప్పగించేలా మిల్లుల్లో ఏర్పాట్లు చేశారు.  - అంబాదాస్​ రాజేశ్వర్​, డీఎం, సివిల్​ సప్లై