IPL Retention 2025: పంత్‌ను కొనేంత డబ్బు మా దగ్గర లేదు: సిఎస్‌కె CEO

2016 నుండి ఎనిమిది సీజన్లు ఆడిన తర్వాత టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకుండా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రిటెన్షన్ తర్వాత ఈ వార్త సంచలనంగా మారింది. ఆ తర్వాత రైనా వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ధోనీతో పంత్ ను చూశానని.. అతడు ఐపీఎల్ 2025 లో చెన్నైకి రాబోతున్నట్టు మాట్లాడాడు. నివేదికలు కూడా రిషబ్ పంత్ పై చెన్నై ఆసక్తి చూపిస్తున్నట్టు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారనే పుకార్లపై చెన్నై సూపర్ కింగ్స్ మౌనం వీడింది. చెన్నై సూపర్ కింగ్స్ సిఇఒ కాశీ విశ్వనాథన్ శనివారం (నవంబర్ 9) పంత్ తో పాటు టాప్ భారత ప్లేయర్లను తీసుకునే విషయంపై స్పందించారు. "గైక్వాడ్, జడ్డూ, ధోనీ, శివమ్ దూబే, మతీషా పతిరానా రిటెన్షన్‌లపై నిర్ణయం తీసుకోవడం చాలా సులభం. ఈ ఆటగాళ్లను రిటైన్ చేస్తే వేలంలోకి వెళ్లడానికి మాకు తక్కువ పర్సు ఉంటుందని తెలుసు. అత్యుత్తమ భారత ఆటగాళ్ల విషయానికి వస్తే ఇతర జట్లతో పోటీ పడలేమని నా ఉద్దేశ్యం. కానీ వారిని కొనడం చాలా కష్టం". అని విశ్వనాథన్ అన్నారు.  

విశ్వనాథన్ మాటలను చూస్తుంటే పంత్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఆక్షన్ లో తీసుకోవడం కష్టంగా కనిపిస్తుంది. అతనితో పాటు రాహుల్, అయ్యర్ లను దక్కించుకోవడం అసాధ్యం. మెగా ఆక్షన్ లోకి చెన్నై సూపర్ కింగ్స్ రూ. 55 కోట్లతో వెళ్లనుంది. పంత్  దక్కించుకోవాలంటే రూ. 20 కోట్లు అయినా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చెన్నై యాజమాన్యం వెనకడుగు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.      

Also Read : ఒక ప్లేయర్‌కు ఇన్ని అవకాశాలా   

ఐపీఎల్ 2025 కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురిని రిటైన్ చేసుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు జడేజాకు రూ. 18 కోట్ల రూపాయలు ఇచ్చారు. లంక ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరానాకు రూ. 13 కోట్లు.. ఆల్ రౌండర్ శివమ్ దూబే రూ. 12 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ. 4 కోట్ల రూపాయలతో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు.