ట్రైబల్ వెల్ఫేర్లోని సీఆర్టీలకు మినిమమ్ బేసిక్ పే ఇవ్వాలి: మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు మినిమమ్ బేసిక్ పే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం మంత్రి సీతక్క ను ఆయన గిరిజన ఆశ్రమ స్కూల్స్ కాంట్రాక్ట్ టీచర్లతో కలిసి వినతిపత్రం అందించారు. 

ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు, ట్రైబల్ వెల్ఫేర్ కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని తెలిపారు. వారి సమస్యలు పరిష్కరించి, సమ్మె విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి స్కూళ్లలో పనిచేస్తున్న సీఆర్టీలు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. సీఎంతో చర్చించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆశ్రమ స్కూల్స్ కాంట్రాక్టు టీచర్ల సంఘం నేతలు అజ్మీరా శివ నాయక్, సక్రం, పసుపులేటి శ్రీను, లక్ష్మణ్ నాయక్, రూప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.