మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

 కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది బోనాలు సమర్పించి గంగిరేగు చెట్లు వద్ద పట్నాలు వేశారు. అనంతరం కొండపైన  రేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకుడు రాములు, ఆలయ సిబ్బంది, అర్చకులు భక్తులకు సేవలందిచారు.