మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి, వెలుగు:కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శ్రావణం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మార్మోగాయి. శనివారం సాయంత్రం నుంచే క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయమే స్నానమాచరించి దర్శనం కోసం బారులు తీరారు. 

అనంతరం గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు అర్చనలు చేసి నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం కొండపైన  రేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మను దర్శించుకున్నారు. 

ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకుడు రాములు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు.కాగా స్వామివారిని తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుడు  కిషోర్ కుమార్ గౌడ్, సౌత్ సెంట్రల్ రైల్వే ఏజీఎం ధనుంజయులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.