గద్వాల జిల్లాలో 1,800 ఎకరాల్లో పంట నష్టం

  • సర్వే కంప్లీట్​ చేసిన అధికారులు

గద్వాల, వెలుగు:జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టం పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 1,800 ఎకరాల్లో 1,645 మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం జరిగింది. అగ్రికల్చర్  ఆఫీసర్లు ఫీల్డ్  విజిట్  చేసి పంట నష్ట పరిహారాన్ని అంచనా వేశారు. జిల్లాలో రెట్టింపు వర్షపాతం నమోదు కావడంతో పత్తి, కంది, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది.

పంట నష్టం వివరాలివే..

జిల్లాలో 15 రోజులు కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయారు. 626 ఎకరాల్లో పత్తి, 32 ఎకరాల్లో వేరుశనగ, 217 ఎకరాల్లో వరి, 260 ఎకరాల్లో మిరప, 583  ఎకరాల్లో కంది, 87 ఎకరాల్లో పొగాకు, 6 ఎకరాల్లో బెండ, 11 ఎకరాల్లో నైస్  పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్  ఆఫీసర్లు తేల్చారు. ఇదిలాఉంటే అగ్రికల్చర్  ఆఫీసర్లు పంటలు పరిశీలించి వివరాలు సేకరించారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పంట పొలాల్లో వరద నీరు చేరి పంటలు నీట మునిగాయి.

దాదాపు వారం రోజులు పొలాల్లో నీరు నిలిచి ఉండడంతో దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే ప్రజాప్రతినిధులు తమకు భరోసా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లా అధికారులు దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం పట్ల రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.