మహబూబ్​నగర్, వనపర్తి జిల్లాల్లో నేరాలు పెరిగినయ్​ .. వనపర్తిని వణికిస్తున్న వరుస చోరీలు

  • నిరుడు కంటే 56 శాతం పెరిగిన దొంగతనాలు
  • పాలమూరులో 15 శాతం పెరిగిన సైబర్​ మోసాలు
  • 2024 క్రైమ్​ రిపోర్ట్​లో వెల్లడించిన పోలీస్​ ఆఫీసర్లు

పాలమూరు/వనపర్తి, వెలుగు: మహబూబ్​నగర్, వనపర్తి జిల్లాల్లో సైబర్​ మోసాలు, వరుస చోరీలు ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రెండు జిల్లాల్లో నిరుడు కంటే ఈ తరహా క్రైమ్స్​ పెరిగిపోయాయి. మహబూ‌‌బ్​నగర్​ జిల్లాలో గతేడాది 5,867 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5,887 కేసులు ఫైల్​ అయినట్లు ఆదివారం ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన 2024 వార్షిక నేర సమీక్షలో ఎస్పీ జానకి వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం నిరుడితే పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో 20 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లాలో అత్యధిక కేసులు నమోదైన స్టేషన్లలో జడ్చర్ల టౌన్​ స్టేషన్​లో 913 కేసులు, మహబూబ్​నగర్​ రూరల్​ పీఎస్​లో 844 కేసులు రికార్డ్​ అయ్యాయి. అత్యల్పంగా కేసులు నమోదైన స్టేషన్లలో మహిళా పోలీస్​ స్టేషన్​లో 130 కేసులు, ముసాపేట పీఎస్​ 204 కేసులు ఫైల్​ అయ్యాయి.
.
ఆందోళన కలిగిస్తున్న చోరీలు

వనపర్తి జిల్లాలో చోరీల సంఖ్య నిరుడితో పోల్చితే ఈ ఏడాది 56 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో గతేడాది 152 చోరీలు జరిగితే ఈసారి 238 చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో చిన్నంబావి వద్ద  నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లికి చెందిన బంగారు వ్యాపారిని దుండగులు హత్య చేసి కాల్వలో పడేశారు. అతడి వద్ద ఉన్న నగలను కాజేయాలని పథకం పన్ని హత్య చేసిన దుండగులు నగలు, నగదుతో ఉడాయించారు. 

ఈ నెల18న రాత్రి పెబ్బేరు శివారులో ఆగి ఉన్న కారుపై దోపిడీ దొంగలు దాడి చేశారు. జగిత్యాలకు చెందిన యాత్రికులు తిరుపతి వెళ్లి తిరిగిస్తూ.. పెబ్బేరు శివారులో కారు ఆపుకొని విశ్రాంతి తీసుకుంటుండడగా.. మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్​ యాత్రికుల కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేసి దోపిడీ చేశారు. చిన్నంబావి, పెబ్బేరు ఘటనల్లో ఉత్తరాది రాష్ట్రాల దొంగలే దోపిడీలకు పాల్పడ్డారు. ఇదే నేషనల్​ హైవేపై రెండు నెలల కింద వెహికల్స్​పై దాడి చేసి దోపిడీ చేసిన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు 
చెబుతున్నారు. 

పాలమూరులో పెరిగిన సైబర్​ క్రైమ్స్

గతేడాదితో పోలిస్తే పాలమూరు జిల్లాలో సైబర్  నేరాలు 15 శాతానికి పెరిగాయి. సైబర్  నేరగాళ్ల వలలో పడి డబ్బులు కోల్పోయిన బాధితులకు సైబర్  క్రైమ్  పోలీసులు రూ.55 లక్షలు రికవరీ చేశారు. సైబర్  నేరగాళ్ల చేతిలో చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రంక్  అండ్  డ్రైవ్  తనిఖీలో 2,033 మంది పట్టుపడ్డారు. వారికి జరిమానాలు విధించి కేసులు పెట్టారు. గత ఏడాది 171 రౌడీ షీట్లు నమోదు కాగా, ఈ ఏడాది మూడు రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. మొబైల్  ఫోన్లు పోగొట్టుకున్న కేసుల్లో 3,200 అప్లికేషన్లు రాగా.. అందులో వెయ్యి ఫోన్లు రికవరీ చేశారు.  ఇసుక అక్రమ రవాణా కేసులు 337, పీడీఎస్  రైస్  అక్రమ రవాణా కేసులు 29 నమోదయ్యాయి. 

10 మందిపై జూదం కేసులు ఫైల్​ చేశారు. అలాగే 2023లో 26 మర్డర్లు జరగగా.. ఈ ఏడాది 30 జరిగాయి. నిరుడు 103 అత్యాచారం కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 105 కేసులు, 2023లో 169 చీటింగ్​ కేసులు కాగా, ఈ ఏడాది 134 కేసులు ఫైల్​ అయ్యాయి. నిరుడు 157 చోరీ కేసులు నమోదు కాగా, ఈఏడాది 201 కేసులయ్యాయి. మహిళలపై దాడులకు సంబంధించి నిరుడు 446 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 468 కేసులు నమోదైనట్లు పోలీసులు క్రైమ్​ రిపోర్టులో వెల్లడించారు. 

తాగి నడిపితే జైలుకే..

న్యూ ఇయర్​ సందర్భంగా డిసెంబర్  31న డ్రంక్  అండ్  డ్రైవ్  చెకింగ్​ నిర్వహిస్తాం. మందు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తాం. జిల్లాలో గంజాయి తీసుకునే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా టెస్టింగ్  కిట్లను అందుబాటులో ఉంచాం. ఎవరైనా గంజాయి తీసుకునే వారు కనిపిస్తే  పోలీసులకు సమాచారం ఇవ్వాలి. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్  సిగ్నల్  వ్యవస్థ నడుస్తోంది. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్  రూల్స్  పాటించాలి.

డి.జానకి, ఎస్పీ, మహబూబ్​నగర్​