Robin Uthappa: నన్నూ మోసం చేశారు.. అరెస్ట్ వారెంట్ పై స్పందించిన ఊతప్ప

ఉద్యోగుల పీఎఫ్‌ నిధుల స్వాహా కేసులో భారత మాజీ క్రికెటర్ రాబిన్‌ ఉతప్పపై అరెస్ట్‌ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై, తనపై వస్తున్న ఆరోపణలపై భారత క్రికెటర్ స్పందించారు. సదరు కంపెనీలో తాను ఎలాంటి ఎగ్జిక్యూటివ్ రోల్ పోషించడం లేదని ఊతప్ప స్పష్టం చేశారు. పెట్టుబడి పెట్టడం వల్ల తనకు డైరెక్టర్ అన్న పదవి ఇచ్చారు తప్ప.. సంస్థ వ్యవహారాల్లో తాను ఎన్నడూ కల్పించుకోలేని వివరణ ఇచ్చారు. పెట్టబడి పెట్టిన నిధులను తిరిగి చెల్లించకుండా తనను మోసం చేశారని అన్నారు.

నేనూ బాధితుడినే..!

"నాపై పీఎఫ్‌ మోసం కేసు నమోదు కావడంతో.. నేనేదో తప్పు చేసినట్లు అనేక వార్తలు వస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన చేస్తున్నా. నేను 2018-19లో సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో  డైరెక్టర్‌గా నియమితుడినయ్యా. పెట్టబడి పెట్టడంతో పెట్టడంతో నాకు ఆ పదవి ఇచ్చారు. కానీ యాక్టివ్ ఎగ్జిక్యూటివ్ రోల్‌ను నేనెన్నడూ పోషించలేదు. బోర్డ్ అఫ్ డైరెక్టర్లు తీసుకునే నిర్ణయాల్లో ఎన్నడూ కల్పించుకోలేదు. క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా, టీవీ ప్రెజెంటర్‌గా బిజీగా ఉండేవాడిని. అందుకే కంపెనీ కార్యక్రమాల్లో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. కొన్నేళ్ల క్రితమే నేను ఆ పదవికి రాజీనామా చేశాను. ఇదొక్కటే కాదు.. మరికొన్ని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టా. అక్కడా ఎన్నడూ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వర్తించలేదు.."

"ఇంకొక్క విషయం.. నేను సెంటారస్ లైఫ్ స్టైల్‍లో  పెట్టుబడి పెట్టిన నిధులను తిరిగి చెల్లించడంలో సంస్థ విఫలమైంది. దానిపై న్యాయపరమైన చర్యలు తీసుకొనేందుకు సిద్ధమయ్యాను. ఇప్పటికే నా లీగల్ టీమ్‌ ఆ పనుల్లో నిమగ్మమయ్యారు. న్యాయపరంగానే దీనిని ఎదుర్కొంటా.. ఉద్యోగుల పీఎఫ్‌ నిధుల అవకతవకల్లో నా ప్రమేయం లేదు. నిజానిజాలు తెలుసుకొని కథనాలు రాయాలని మీడియాను కోరుతున్నా.." అని ఉతప్ప వివరణ ఇచ్చారు.

ఏంటా కంపెనీ..?

బెంగళూరుకు చెందిన సెంటారస్‌ లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఈ ఘటన జరిగింది. సదరులో సంస్థలో రాబిన్ ఊతప్ప డైరెక్టర్‌గా ఉన్నారు. ఉద్యోగులకు చెల్లించే జీతం నుంచి ప్రతి నెలా పీఎఫ్‌ అమౌంట్ కట్ చేస్తున్న యాజమాన్యం.. వాటిని ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయకుండా తప్పుదోవ పట్టించారు. మొత్తంగా దాదాపు 23 లక్షల రూపాయలు ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశారు. నిధులు తిరిగి చెల్లించేందుకు ఈ నెల 27 వ‌ర‌కు గడువిచ్చారు. అప్పటికి చెల్లించ‌కుంటే అత‌న్ని అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

2006లో భార‌త జ‌ట్టు త‌ర‌పున అంత‌ర్జాతీయ అరంగ్రేటం చేసిన ఊతప్ప.. 59 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. వన్డేల్లో 934, టీ20ల్లో 249 పరుగులు చేశాడు. పేసర్ల బౌలింగ్ లో ముందుకొచ్చి సిక్సర్లు కొట్టడంలో ఈ భారత క్రికెటర్ బాగా ఫేమస్.