Hanuma Vihari: ఏపీ క్రికెట్ లో రాజకీయ నేతల పెత్తనం.. భారత క్రికెటర్ భావోద్వేగ పోస్ట్

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో ఆంధ్రప్రదేశ్‌ క్వార్టర్‌ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ వెటరన్ క్రికెటర్ హనుమ విహారి తన కెప్టెన్సీ బాధ్యతల నుండి వైదొలిగి షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సోషల్ మీడియా లో ఓ సంచలన పోస్టు పెట్టి సంచలనాల విషయాలను బయట పెట్టాడు.  

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా.. మీడియాలో వార్తలు వచ్చినట్టుగా ఆయన తన బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలనో లేక మరో కారణంతోనో తాను ఏపీ టీమ్‌ కెప్టెన్సీకి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. 'ఫస్ట్ మ్యాచ్ బెంగాల్‌తో ఆడినప్పుడు నేను కెప్టెన్. నేను 17వ ప్లేయర్ పై అరిచాను. అతను తండ్రి ఒక రాజకీయ నాయకుడు. అతను తన తండ్రికి నా మీద ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయన తండ్రి నాపై యాక్షన్ తీసుకోవాలని అసోసియేషన్‌కు చెప్పాడు. గతేడాది ఫైనలిస్టు జట్టు బెంగాల్ పై మేం 410 పరుగులు చేశాం. అయినా.. నన్ను కెప్టెన్సీకి రాజీనామా చేయాలని ఆదేశించారు. అని విహారి అన్నారు.   

ఇది విహరికీ చాలా అవమానంగా అనిపించిందని.. ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నా అది కేవలం  నాకు ఆటపై, నా టీంపై ఉన్న గౌరవమే. ఇప్పటివరకు నేను అవమానపడినా ఇప్పటి వరకు ఈ విషయాలను వెల్లడించలేదని విహారి అన్నారు. ఈ రోజు ముగిసిన క్వార్టర్‌ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌పై కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయి ఆంధ్రప్రదేశ్ రంజీ ట్రోఫీ సీజన్‌ నుండి నిష్క్రమించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ప్రదేశ్ 69.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.