రాజ్యాంగాన్ని మార్చేకుట్ర జరుగుతోంది : తమ్మినేని వీరభద్రం

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఇబ్రహీంపట్నం, వెలుగు : కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సీపీఎం 10వ జిల్లా మహాసభలు శనివారం ఇబ్రహీంపట్నంలో జరిగాయి. తమ్మినేని వీరభద్రం పాల్గొని మాట్లాడారు. పార్లమెంటులో దేశ హోంమంత్రి అమిత్​షా అంబేద్కర్ పై మాట్లాడిన తీరు కేంద్ర వైఖరికి నిదర్శనమన్నారు. జమిలీ ఎన్నికలు తేవడం కోసం ప్రయత్నాన్ని మొదలు పెట్టారన్నారు.

జమిలీకి సీపీఎం వ్యతిరేకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం అవుతున్నారన్నారు. ఇబ్రహీంపట్నంలో ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ పేరుతో మరోసారి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర నాయకులు జాన్ వెస్లి, పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి భాస్కర్, నాయకులు యాదయ్య, జంగారెడ్డి పాల్గొన్నారు.