ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్‌‌‌‌

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య

సంగారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతింది.. అందుకే ఎర్రజెండాలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కోల్పోయేలా చేశాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ముందుకు సాగుతామన్నారు. 

జనవరి 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర నాలుగో సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన మీట్‌‌‌‌ ది ప్రెస్‌‌‌‌లో వీరయ్య మాట్లాడారు. సంగారెడ్డిలో నిర్వహించే మహాసభలు రాష్ట్ర రాజకీయాలను మార్చేవిధంగా ఉంటాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అన్ని వర్గాలను మోసం చేశాయని, ఇప్పుడు ప్రజలకు ప్రత్యామ్నాయం వామపక్షపార్టీలే అన్నారు. 

తెలంగాణకు మణిహారమైన సింగరేణిని ప్రైవేట్‌‌‌‌పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తే, దానికి మద్దతుగా గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ సింగరేణికి సంబంధించిన రెండు బ్లాకులను అమ్మేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌ తరహాలోనే కాంగ్రెస్‌‌‌‌ కూడా అన్ని వర్గాలను మోసం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖానీ చేస్తోందన్నారు. 

ఆర్టీసీ బలోపేతాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ, కార్మిక సంఘాలు ఐక్యం కాకుండా చేస్తున్నాయన్నారు. కనీస వేతనాల కోసం జీవో రిలీజ్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్‌‌‌‌ చుక్క రాములు మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే సీపీఎం నాలుగో  మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వెయ్యి మంది ప్రతినిధులతో నిర్వహించే ఈ సభకు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లికార్జున్, అడివయ్య, మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి జి.జయరాజు, నర్సింలు  పాల్గొన్నారు.