జమిలి ఎన్నికలు నియంతృత్వానికి నిదర్శనం : సీపీఎం నేత బీవీ రాఘవులు

హైదరాబాద్, వెలుగు: భారతీయులు విశ్వమానవులని, వారిని ఒక్కటిగా ఉంచగలిగింది రాజ్యాంగమేనని, దానిని కాపాడుకోవడం మన కర్తవ్యమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచంలో ఎలక్టోరల్ డిక్టేటర్ షిప్ అనే కొత్త సంస్కృతి తెరపైకి వచ్చిందని, అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక కూడా నియంతృత్వానికి దారి తీస్తుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూటీఎఫ్ సీనియర్ నేత అక్షయ కుమార్ దత్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బీవీ రాఘవులు మాట్లాడారు.

మన అస్థిత్వం భారతీయత అని, భారతీయులందరికీ సమాన హక్కులు ఉండాలన్నారు. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో అమలవుతున్న పౌరసత్వ ప్రాతిపదిక జాతీయవాదం (సిటిజన్ బేస్డ్ నేషనలిజమ్) మన దేశంలో అమలు కాకుండా అడ్డుకోవడానికి ముస్లింలను మినహాయించి పౌరసత్వ సవరణ చట్టం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడితే, బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్య వాదం, సామాజిక న్యాయం, సామ్యవాదం కాపాడాలని కోరారు.

మతం వ్యక్తిగతమని, రాజ్యం జోక్యం ఉండకూడదని వెల్లడించారు. పెట్టుబడిదారీ సమాజంలో అసమానతలు పెరిగాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ పట్ల వ్యతిరేకత, సామ్యవాద భావనకు మద్దతు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి తదితరులు పాల్గొన్నారు.