ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలి : ఏపీ మల్లయ్య

కల్వకుర్తి,వెలుగు : ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచి ప్రయాణికులకు ఇబ్బందులు  లేకుండా చూడాలని, ప్రతీ పల్లెకు పల్లె వెలుగు బస్సు నడపాలని  సీపీఎం  జిల్లా నాయకుడు ఏపీ మల్లయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఇందుకోసం సోమవారం కల్వకుర్తి ఆర్టీసీ బస్టాండ్​లో ఆందోళన చేపట్టారు.  ప్రతీ పల్లెకు బస్సు నడపడం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన  లక్ష్యం నెరవేరుతుందన్నారు.  

పల్లెల నుంచి పట్టణాలకు కూరగాయలు అమ్ముకోవడానికి, పాలు విక్రయించడానికి, కూలీ పనులకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆంజనేయులు, భవన నిర్మాణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

కొల్లాపూర్ : బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అదనంగా బస్సులు కొనుగోలు చేసి మారుమూల ఆదివాసీ గూడేలకు బస్సు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా నాయకుడు డి.ఈశ్వర్, తాలూకా కార్యదర్శి శివవర్మ డిమాండ్  చేశారు. కొల్లాపూర్, పెంట్లవెల్లి  మండల కేంద్రంలో సోమవారం నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులకు సరిపడా బస్సులు పెంచాలని, మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని, పెంట్లవెల్లి బస్టాండ్​ను  అందుబాటులోకి తేవాలని డిమాండ్  చేశారు. శ్రీనివాసులు, తిమ్మ స్వామి, సురేందర్, గోపాల్, కుర్మయ్య, బాలరాజు, వెంకటస్వామి, రాజు, యాదమ్మ పాల్గొన్నారు.