పోరాటాలకు కేరాఫ్‌‌‌‌‌‌‌‌ ఎర్రజెండానే : కూనంనేని సాంబశివరావు

  • నేడు ఎన్జీ కళాశాలలో 100 ఏండ్ల సందర్భంగా భారీ బహిరంగ సభ 
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

నల్గొండ అర్బన్, వెలుగు: కమ్యూనిస్టుల పోరాటాలు లేకుండా దేశ చరిత్ర లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం నల్గొండలోని పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ పోరాటాలు అంటే గుర్తుకు వచ్చేది ఎర్రజెండానే అని తెలిపారు. నల్గొండ జిల్లాలోని సాగర్  కాల్వ కోసం కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసి సాధించారని గుర్తు చేశారు. పోరాటాలు, త్యాగాల చరిత్ర ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్టు నేతలకు దక్కిందన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో 4 వేల మంది అమరులయ్యారని, 10 వేల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంపిణీ చేసిన ఘనత సీపీఐకే దక్కిందన్నారు. కార్మికుల హక్కులు, వర్గ చైతన్యం కోసం అనునిత్యం పోరాటం చేసిందని తెలిపారు. సోమవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్​లో సీపీఐ వందేండ్ల ఆవిర్భావ దినోత్సవ బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరవుతారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్​రెడ్డి తెలిపారు.