8,9 తేదీల్లో రేవంత్​రెడ్డిని అరెస్ట్​ చేస్తరేమో?: సీపీఐ నారాయణ

  • అట్లాగైతే బీజేపీపై వ్యతిరేకతతో కాంగ్రెస్​కు ఎక్కువ సీట్లొస్తయ్​
  • మతోన్మాద బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్​కు మద్దతు 
  • సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ  

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ నెల 8,9 తేదీల్లో అరెస్ట్​చేస్తారేమోనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఆరోపించారు. నాగర్ కర్నూల్ సీపీఐ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రధాని మోదీ దేశద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.  ఈ ఎన్నికల్లో ఉత్తరాదిన మోదీ పేరు ఎక్కడా వినిపించడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామనడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ క్యాండిడేట్​మల్లు రవిని గెలిపించాలని కోరారు. 

అందుకే కాంగ్రెస్​కు మా మద్దతు  

పార్లమెంట్  ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని చిత్తుగా ఓడించడమే కమ్యూనిస్టుల లక్ష్యమని, అందుకే, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నామని నారాయణ అన్నారు. నాగర్ కర్నూల్ సీపీఐ పార్లమెంట్​నియోజవర్గ లీడర్ల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్ నరసింహ,  సాంస్కృతిక కార్పొరేషన్  చైర్మన్  శివకుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగయ్య, రవీంద్ర చారి, ఆనంద్ పాల్గొన్నారు.