దళితుల బాధలు మోదీకి పట్టవు..దేశ సంపదను కార్పొరేట్ మిత్రులకు దోచిపెడ్తున్నరు: రాజా

  • కుల వ్యవస్థను పూర్తిగా తుడిచివేయాలని పిలుపు
  • బడ్జెట్​లో 25శాతం నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే వివేక్
  • ఏఐడీఆర్ఎం జాతీయ రెండో మహాసభలకు హాజరు

హైదరాబాద్, వెలుగు: పేదలు ఎంతో కష్టపడి సృష్టించిన దేశ సంపదను ప్రధాని మోదీ.. తన కార్పొరేట్ మిత్రులకు ధారదత్తం చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా మండిపడ్డారు. దళితులు, ఆదివాసీలు, అట్టడుగు శ్రామిక వర్గాల బాధలు ప్రధానికి పట్టవని విమర్శించారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు ఎలా దోచిపెట్టాలనే దానిపైనే మోదీ ఆలోచిస్తుంటారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్​లోని విశ్వేశ్వరయ్య భవన్​లో సోమవారం అఖిల భారత దళిత హక్కుల ఉద్యమం (ఏఐడీఆర్ఎం) జాతీయ రెండో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏఐడీఆర్ఎం జెండాను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు రామ్మూర్తి ఆవిష్కరించారు. చీఫ్ గెస్ట్​గా హాజరైన డీ.రాజా మహాసభలను ప్రారంభించి మాట్లాడారు.

‘‘దేశంలో సంపద సృష్టిస్తున్నది అదానీ, అంబానీలే అని మోదీ అనుకుంటున్నరు. స్వాతంత్ర్య ఉద్యమంలో దళిత, ఆదివాసీలు కీలక పాత్ర పోషించారు. నేటికీ.. ఆ వర్గాలు వివక్ష ఎదుర్కొంటున్నాయి. దేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకు వామపక్ష, ప్రగతిశీల శక్తులు ఏకం కావాలి’’అని డీ.రాజా పిలుపునిచ్చారు. మనిషి తన మేధోశక్తితో ఏఐ సృష్టించినా.. కుల వ్యవస్థను నిర్మూలించకపోతున్నామని ఎంపీ, దళిత్ సోషన్ ముక్తి మంచ్ జాతీయ అధ్యక్షుడు రాధాకృష్ణన్ అన్నారు. దళితులు, ఆదివాసీలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించినప్పటికీ.. నేటికీ వివక్ష కొనసాగుతున్నదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. దళితుల శ్రమతోనే దేశం ముందుకుపోతున్నదని మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీకేఎంయూ జాతీయ అధ్యక్షుడు అతుల్ అంజాన్, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ఏఐడీఆర్ఎం నేతల మృతిపట్ల మహాసభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని ఆమోదిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఈ కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన కమిటీ చైర్మన్ బాల నరసింహా, ఏఐడీఆర్ఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, జాతీయ నేతలు ఎన్.రాజన్, జీ.లత, మనోజ్, ఎడ్మన్న, దేవికుమారి, గుల్జార్ సింగ్ బొరియా, కే.సుబ్బారావు, మహేదేవ్ కుడే, కే.ఏసురత్న, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

అంటరానితనం తగ్గింది: ఎమ్మెల్యే వివేక్

దళితులు, ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న బడ్జెట్​లో 25శాతం నిధులు కేటాయించాలని చెన్నూరు ఎమ్మెల్మే వివేక్ కోరారు. నిధుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని వివరించారు. ‘‘గతంతో పోలిస్తే సమాజంలో అంటరానితనం తగ్గింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దళిత, ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి. తమ తమ సెగ్మెంట్లకు 25 నుంచి 30 శాతం నిధులు కేటాయించాలి.

నేను కూడా నా నియోజకవర్గానికి 25శాతం ఫండ్స్ దళితుల అభివృద్ధికి కేటాయించేలా ముందుకెళ్త. ఇతర వర్గాలతో పోలిస్తే దళితులు ఎక్కువగా కష్టపడుతున్నరు. ఏఐడీఆర్ఎం జాతీయ మహాసభలు నిర్వహించడం అభినందనీయం’’అని వివేక్ తెలిపారు.