ఐదు గంటలు.. ఆగమాగం

  • పత్తి కొనుగోళ్లను నిలిపివేసిన వ్యాపారులు
  • తీవ్ర ఇబ్బందులకు గురైన రైతులు
  • రవాణా, లోడింగ్ చార్జీలు అదనపు భారం

సిద్దిపేట, వెలుగు: జిల్లా వ్యాప్తంగా సోమవారం జిన్నింగ్​మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను ఐదు గంటలు నిలిపివేశారు. సీసీఐ (కాటన్​కార్పొరేషన్​ఆఫ్​ఇండియా)  కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావడం, పత్తి తేమ విషయంలో కఠినంగా వ్యవహరించడాన్ని జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో సోమవారం ప్రైవేట్, సీసీఐ పత్తి కొనుగోళ్లను జిన్నింగ్ మిల్లులు నిలిపివేశాయి.

ఈ విషయం తెలియని రైతులు వాహనాల్లో పత్తిని మిల్లుల వద్దకు తీసుకొచ్చి నిరాశగా వెనుదిరిగారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో సాయంత్రం  కొనుగోళ్లు ప్రారంభించినా చాలా మంది రైతులు అప్పటికే వెనుదిరిగి వెళ్లిపోయారు.  

నిబంధనలు వ్యతిరేకిస్తున్న మిల్లులు

సీసీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల వల్ల పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవడంతో వాటిని జిన్నింగ్ మిల్లులు వ్యతిరేకిస్తున్నాయి.  సీసీఐ కొత్తగా తెచ్చిన ఎల్1, ఎల్ 2, ఎల్ 3 నిబంధనలను జిన్నింగ్​ మిల్లు యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పద్ధతిలో సీసీఐ మిల్లులో ఉండే సౌకర్యాల ప్రకారం  కేటగిరీలుగా విభజించింది. దీని వల్ల తక్కువ సౌకర్యాలున్న మిల్లులకు పత్తి కొనుగోళ్లలో ఇబ్బంది ఏర్పడుతోంది. వీటిని తొలగించాలని మిల్లు యాజమాన్యాలు సూచించినా సీసీఐ పట్టించుకోలేదు. పత్తిలో తేమ 8 నుంచి 12 శాతం ఉండాలని దాని ప్రకారమే మద్దతు ధర చెల్లించాలని సీసీఐ  సూచిస్తుండడంతో రైతుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మిల్లు యజమాన్యాలు పేర్కొంటున్నాయి. 

రైతులపై అదనపు భారం

తెలంగాణ కాటన్ అసోసియేషన్ పిలుపు మేరకు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులపై అదనపు భారం పడింది. కొనుగోళ్ల బంద్ గురించి తెలియని రైతులు పత్తిని వాహనాల్లో మిల్లుల వద్దకు తెచ్చి విషయం తెలుసుకుని నిరాశకు గురయ్యారు. కొద్ది మొత్తంలో పండిన పత్తి అమ్మకానికి రవాణా, లోడింగ్ చార్జీలను భరించి మిల్లులకు తీసుకొస్తే కొనుగోళ్లు జరపకపోవడంతో చార్జీల భారం రెండింతలు మీద పడినట్లయిందని రైతులు వాపోయారు. ప్రస్తుతం రోజుకు జిల్లాలో 40 వేల క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది కానీ పలు సమస్యల కారణంగా కొనుగోళ్లు సజావుగా జరుగుతాయా లేదా అనేది తెలియడం లేదు. ఇటీవల చలి పెరగడం వల్ల నిబంధనలకు అనుగుణంగా తేమ ఉండడం లేదు. పత్తిని మిల్లులకు తెచ్చిన వెంటనే కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు కోరుతున్నారు.

ఇబ్బందులు లేకుండా పత్తి కొనాలి

రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనాలె. పత్తి లోడ్​తో మిల్లుల వద్దకు వచ్చాక కొనకుంటే రవాణా చార్జీలు మీద పడుతున్నయ్​. అధికారులు కొనుగోళ్ల విషయంలో ఎప్పుటికప్పుడు సమాచారం అందించాలె. కొనడానికి తీసుకొచ్చిన పత్తిని తిరిగి ఇంటికి తీసుకెళ్లడం వల్ల చాలా లాస్​ అవుతున్నాం.- బండారి రాంచంద్రం, రైతు, చేర్యాల