ఆగిన పత్తి కొనుగోళ్లు.. రోడ్డెక్కిన రైతులు

  • వికారాబాద్ జిల్లా పరిగిలో ఘటన

పరిగి, వెలుగు: పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగంపల్లిలో కాటన్ మిల్లు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వాహనాలకు వెయిటింగ్ చార్జీలు ఎక్కువ అవుతున్నాయని ఆగ్రహించి, హైదరాబాద్​– బీజాపూర్ నేషనల్ హైవేపై బైఠాయించారు. 

వివరాల్లోకి వెళ్తే.. రంగంపల్లిలోని నరసింహ కాటన్ మిల్ నుంచి వచ్చిన జిన్నింగ్​లో తేమ శాతం ఎక్కువగా ఉందని ముంబై సీసీఐఎల్ లో టెండర్​దారులు ఫిర్యాదు  చేశారు. దీంతో రెండు రోజులుగా నరసింహ కాటన్ మిల్లులో కొనుగోళ్లు నిలిపివేశారు. ఈ విషయం తెలియక పత్తిని అమ్మేందుకు అక్కడికి వచ్చిన రైతులు ఏం చేయాలో అర్థంకాక ఆందోళనకు దిగారు. 

ALSO READ : విద్యార్థినుల సమస్యలకు కంప్లయింట్​ బాక్సులతో చెక్

పత్తిని కొనుగోలు చేయాలని అధికారులకు విన్నవించుకున్నారు. దీంతో పరిగి వ్యవసాయ మార్కెట్ అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక్కరోజు పత్తి కొనుగోళ్లకు అనుమతించారు. దీంతో రైతులు పత్తిని విక్రయించి వెళ్లారు. మంగళవారం నుంచి  రంగంపల్లి నరసింహ కాటన్ మిల్ లో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు పరిగి వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ విజయ్ కిషోర్ తెలిపారు.