భారత్ లో ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ

భారత్ లో ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ
అనుకున్నట్లు అన్నీ సజావుగా జరిగితే జనవరి 13 నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర అనుమతులు ఇచ్చిన 10 రోజుల్లోగా పంపిణీ ప్రారంభించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల నిర్వహించిన ‘డ్రై రన్’ ప్రక్రియ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రభుత్వ సిద్ధంగా ఉందని ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. భారత్ లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే సంయుక్తంగా తమ సన్నద్ధతను తెలపడం కేంద్రం ప్రకటనకు బలం చేకూర్చుతోంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఈ నెల 3న అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేశారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే ప్రత్యేక టీకా సెంటర్లను ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కేంద్రాల్లో నిల్వ ఉంచిన వ్యాక్సిన్లను,వాటి ఉష్ణోగ్రతలను సాంకేతిక టెక్నాలజీతో  ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుందని తెలిపింది. అంతేకాదు..ప్రాథమిక వ్యాక్సిన్ నిల్వ సెంటర్లను హర్యానలోని కర్నల్,ముంబై,చెన్నై,కోల్ కతా నగరాల్లో ఏర్పాటు చేశామని..వీటితో పాటు కేంద్ర ఔషధ నిల్వ సంస్థ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా మొత్తం 37 వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.