న్యూఢిల్లీ: ప్యాసింజర్లందరూ ఎక్కారు.. టేకాఫ్ అయ్యేందుకు విమానం రెడీగా ఉంది.. ఇంతలో క్యాబిన్ క్రూ దగ్గరికి ఒకడొచ్చిండు.. ‘‘నాకు కరోనా సోకింది’’ అని చెప్పాడు. తమాషా చేస్తున్నాడని సిబ్బంది అనుకున్నారు. ఇంతలోనే.. ‘‘నమ్మరా? అయితే ఈ సర్టిఫికెట్లు చూడండి’’ అంటూ కొన్ని పేపర్లు చూపించాడు. దీంతో సిబ్బంది అవాక్కయ్యా రు. వెంటనే అతడిని పక్కకు తీసుకెళ్లి.. గ్రౌండ్ కంట్రోలర్లకు సమాచారం ఇచ్చారు. విమానాన్ని పార్కింగ్ బే దగ్గరికి తీసుకెళ్లి, ఆ ‘ప్రయాణికుడిని’ దించేశారు. ఫ్లైట్లో అతడికి దగ్గరగా కూర్చున్న ప్రయాణికులను ముందు జాగ్రత్తగా దించేశారు. కరోనా ప్యాసింజర్ కూర్చున్న సీటును డిసిన్ఫెక్ట్ చేశారు. సీట్ కవర్లు మార్చారు. శానిటైజ్ చేసిన తర్వాత ప్యాసింజర్లకు పీపీఈ కిట్లు ఇచ్చి విమానం ఎక్కించారు. ఫ్లైట్ దిగే దాకా వాటిని వేసుకునే ఉండాలని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న విమానంలో జరిగిందీ ఘటన.
