లాక్ డౌన్ రిలీఫ్: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌ల‌కు రూ.5 వేల ఆర్థిక‌ సాయం

లాక్ డౌన్ రిలీఫ్: అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌ల‌కు రూ.5 వేల ఆర్థిక‌ సాయం

క‌రోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్ట‌ర్లు, ఇమామ్‌లు, మౌజన్‌లను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 వేల మందికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. ఈ మొత్తాన్ని రేపు (మంగ‌ళ‌వారం) సీఎం జ‌గ‌న్ ఆన్ లైన్ ద్వారా ఒక్క క్లిక్ తో వారి బ్యాంకు అకౌంట్ల‌లో డిపాజిట్ చేయ‌నున్నారు.

లాక్ డౌన్ లో ఎటువంటి ప‌నులు లేక ఇబ్బందులు ప‌డుతున్న అర్చకులు, పాస్ట‌ర్లు, ఇమామ్‌లు, మౌజన్‌ల వివ‌రాల‌ను ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సేక‌రించింది. దేవాదాయ‌, మైనారిటీ శాఖ ద్వారా వారికి సాయం అందించేందుకు ఆయా డిపార్ట్ మెంట్లు ఆన్ లైన్ లో వారి బ్యాంకు అకౌంట్ వివ‌రాల‌ను న‌మోదు చేశాయి. వీరందరికీ వన్‌టైం సహాయం కింద రూ. 5 వేల నగదును నేరుగా వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. దాదాపు 34 వేల మంది అర్చకులు, 30 వేల మంది పాస్టర్లు, 14 వేల మంది ఇమామ్, మౌజమ్‌లు ఈ సహాయం పొందనున్నారు. దాదాపు రూ.38 కోట్ల నగదు సాయం ప్రభుత్వం అందించనుంది.