డేంజర్ బెల్స్: ఒక్కరి నుంచి 533 మందికి సోకిన కరోనా

డేంజర్ బెల్స్: ఒక్కరి నుంచి 533 మందికి సోకిన కరోనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని ఒక్కరికి సోకినా చాలా మందికి సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. ఇప్పుడు దీనికి ఊతం ఇచ్చే ఓ ఘటన ఆఫ్రికాలోని ఘనాలో జరిగింది. ఘనాలోని అట్లాంటిక్ సముద్రతీర నగరమైన తేమాలోని ఓ ఫిష్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పని చేసే ఒక ఉద్యోగి నుంచి 533 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని ఘనా ప్రెసిడెంట్ అకుఫో అడ్డో తెలిపారు.

ఒక్కరి నుంచి 533 మందికి కరోనా సోకిందని అకుఫో చెప్పారు. కరోనా వల్ల తమ దేశంలో 22 మంది చనిపోయారని, 494 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలను ఆయన బయటపెట్టలేదు. వ్యాధి ఒకరి నుంచి ఇంత మందికి ఎలా సోకిందనేది ఇంకా తెలియరాలేదు. ఘనాలో కరోనా కేసుల సంఖ్య 4,700 దాటింది. వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇదే హైయస్ట్.