సెన్సెక్స్ 1,400 పాయింట్ల పతనం
నిమిషానికి రూ. 1,850 కోట్లు నష్టం
500 షేర్లు లోయర్ సర్క్యూట్
షార్ట్ టర్మ్‌లో మార్కెట్లు పడొచ్చన్న ఎనలిస్టులు
గత ఏడు నెలల్లో అతి పెద్ద సింగిల్ డే లాస్
బిజినెస్ డెస్క్, వెలుగు: ఈ ఏడాది మే నుంచి పెరుగుతూ వస్తున్న ఇండియన్ మార్కెట్లకు సోమవారం సెషన్‌లో గట్టి దెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌లో కొత్త రకం కరోనా వైరస్ విస్తరించడం, అమెరికా ఎకనామిక్ డేటా ఆశాజనకంగా లేకపోవడం, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడం వంటి కారణాలు మార్కెట్లను కిందకు లాగాయి. సోమవారం సెషన్‌లో బెంచ్‌మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ 1,407 పాయింట్లు నష్టపోయి 45,554 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 2,000 వేల పాయింట్లకు పైగా పతనమైన ఈ ఇండెక్స్, చివరికి 600 పాయింట్లు రికవరీ అవ్వగలిగింది.
నిఫ్టీ 432 నష్టపోయి 13,328 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా ఈ ఇండెక్స్ పతనమయ్యింది. సెన్సెక్స్‌లో రూ. ఏడు లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ఏకంగా 500 స్టాకులు లోవర్ సర్క్యూట్‌ను టచ్ చేశాయి. సెన్సెక్స్‌లో అన్ని షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ , ఐటీసీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఫన్నీ విషయం ఏంటంటే మార్చిలో ఐపీఓకి వద్దామని ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ నిర్ణయించుకుంది. ఆ తర్వాత మార్కెట్లు భారీగా పడ్డాయి. తర్వాత కంపెనీ తన ఐపీఓని వాయిదా వేసింది. తిరిగి సోమవారం ఓపెన్ అయిన కంపెనీ ఐపీఓ, మొదటి కొన్ని గంటల్లోనే 1.1 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను సాధించింది. కానీ మార్కెట్లు ఈవినింగ్ సెషన్‌లో పడ్డాయి.
మార్కెట్ పడడానికి కారణాలు..
ఇంగ్లండ్‌లో కొత్త రకం కరోనా వైరస్ విస్తరించడంతో ఇండియాతో సహా వివిధ దేశాలు ఈ దేశానికి వెళ్లడం, రావడంపై రెస్ట్రిక్షన్లు విధించాయి. దీనికి తోడు పోస్ట్–బ్రెగ్జిట్ ట్రేడ్ డీల్‌పై యూకే–యురోపియన్ యూనియన్ మధ్య ఏకాభిప్రాయం కుదర లేదు. మార్కెట్లు పడడానికి ఇది కూడా కారణమే. యూఎస్ ఎకనామిక్ డేటా ఆశాజనకంగా లేకపోవడం, ఈ దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడం వంటివి గ్లోబల్‌గా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. 900 బిలియన్ డాలర్ల విలువైన స్టిమ్యులస్ ప్యాకేజిని తీసుకురావాలని యూఎస్ కాంగ్రెస్ చూస్తోంది. ఈ నిర్ణయం మార్కెట్లకు సపోర్ట్‌గా ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయకుమార్ అన్నారు. ఇండియన్ మార్కెట్లు అధిక వాల్యుషన్‌తో ట్రేడవుతున్నాయని ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని సలహాయిచ్చారు.
నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు..
గ్లోబల్ మార్కెట్లు సోమవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడయ్యాయి. జపాన్ నికాయ్ , హాంకాంగ్ హంగ్‌సెంగ్ నష్టాల్లో క్లోజవ్వగా, షాంఘై, కొస్పి మార్కెట్లు స్వల్ప లాభాలతో సెషన్‌ను ముగించాయి. యురోపియన్ మార్కెట్లు నెగెటివ్‌లో ఓపెన్ అయ్యాయి. లండన్, స్టాక్‌హోం, పారిస్, అమెస్టర్‌డామ్, స్విట్జర్లాండ్, మాడ్రిడ్ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.
రూపాయి విలువ తగ్గింది
ఇండియన్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో పాటు, గ్లోబల్‌గా డాలర్ బలపడడంతో డాలర్ మారకంలో రూపాయి సోమవారం 23 పైసలు బలహీనపడింది. క్రూడాయిల్ ధరలు తగ్గడంతో రూపాయి పతనం తక్కువగా ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో 73.74 వద్ద ఓపెన్ అయిన డాలర్ మారకంలో రూపాయి, చివరికి 23 పైసలు బలహీనపడి 73.79 వద్ద సెటిలయ్యింది. శుక్రవారం సెషన్‌లో డాలర్ మారకంలో రూపాయి 73.56 వద్ద ముగిసింది.
గోల్డ్ పెరిగింది..
ఇండియన్ ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ధరలు సోమవారం పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి పతనం అవ్వడంతో పాటు గ్లోబల్‌గా విలువైన మెటల్స్ లాభపడుతుండడంతో గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ ధర సోమవారం రూ. 496 పెరిగి రూ. 50,297 కు చేరుకుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పేర్కొంది. శుక్రవారం గోల్డ్(10 గ్రాములు) రూ. 49,801 వద్ద క్లోజయ్యింది. కేజి సిల్వర్ రూ. 2,249 పెరిగి రూ. 69,477 ను తాకింది.
గ్లోబల్ మార్కెట్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో ఇండియన్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. ఈ ట్రెండ్ రానున్న సెషన్‌లలో కూడా కొనసాగుతుందని అనుకుంటున్నాం. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ట్రావెల్ రెస్ట్రిక్షన్లు ప్రారంభమయ్యాయి. ఎకానమీ రికవరీకి ఇది నష్టం చేకూరుస్తుంది. నిఫ్టీకి 13,400– 13,600 రేంజ్‌లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండగా, 12,700–12,800 రేంజ్‌లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ప్రస్తుతం ఫ్యూచర్ ట్రేడింగ్‌లో లెవెరేజిని ఎక్కువగా వాడొద్దని, మార్కెట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఆప్షన్ ట్రేడింగ్‌ను ఎంచుకోవడం మంచిదని సలహాయిస్తున్నాం. మరోవైపు క్వాలిటీ స్టాకులు ధరలు తగ్గితే కొనుక్కోవడం మంచిది.– అజిత్ మిశ్రా, రెలిగర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్
గత 11 సెషన్‌లలో వచ్చిన లాభాలను ఈ ఒక్క సెషన్‌లోనే మార్కెట్లు కోల్పోయాయి. నిఫ్టీ డైలీ చార్ట్‌లో షార్ట్ టర్మ్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది. నిఫ్టీకి 13,000 దగ్గర సపోర్ట్ ఉంది. అది కూడా కోల్పోతే 12,500 వద్ద మద్దతు లభించనుంది. – శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
