గుంటూరు మిర్చి యార్డుకు మరోసారి కరోనా సెగ తగిలింది. మిర్చి యార్డులో క్రయ విక్రయాలు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యాపారస్థులకు తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. దీంతో మూడు రోజుల పాటు మిర్చి యార్డును మూసి వేయాలని పాలకవర్గం నిర్ణయించింది. శుక్రవారం ఒక్క రోజు ట్రేడింగ్ ను నిలిపివేస్తే శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఏ దుకాణాల్లో అయితే కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయో.. వాటిని బ్యారికేడ్లతో కట్టడి చేశారు. అలాగే యార్డు అంతా సోడియం హైపోక్లోరైడ్ తో క్రిమి సంహారకంతో శానిటైజ్ చేశారు. మిర్చి యార్డులోకి ఎవరూ రాకుండా గేట్లు వేసి సెక్యూరిటీ సిబ్బందితో పహారా కాస్తున్నారు. మూడు రోజుల తర్వాత అంటే సోమవారం మిర్చి యార్డును తెరచి క్రయ విక్రయాలు యథాతథంగా నిర్వహిస్తామని పాలకవర్గం ప్రకటించింది.
