వంట నూనెల రేట్లు తగ్గుతున్నయ్​

వంట నూనెల రేట్లు తగ్గుతున్నయ్​

న్యూఢిల్లీ: వంట నూనెల రంగంలోని పెద్ద కంపెనీలన్నీ పామాయిల్​, సన్​ఫ్లవర్​ ఆయిల్​, సోయాబీన్​ ఆయిల్​ రేట్లను తగ్గిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గుముఖం పట్టడంతో ఈ కంపెనీలు దేశీయ మార్కెట్లో రేట్లను 15 శాతం దాకా తగ్గిస్తున్నాయి. ధరల మంటతో బెంబేలెత్తుతున్న వినియోగదారులకు ఇది కొంత ఊరట కలిగించేదే. మార్కెట్లో పాపులర్​ బ్రాండ్ల రేట్లు వెంటనే తగ్గుతాయని, ప్రీమియం బ్రాండ్ల రేట్లు తగ్గడానికి కొంత టైము పట్టొచ్చని ఇండియన్​ వెజిటబుల్​ ఆయిల్​ ప్రొడ్యూసర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ సుధాకర రావు దేశాయ్​ చెప్పారు. ధరల తగ్గుదల ప్రకటనతో డిమాండ్​ పుంజుకుంటుందని, డిస్ట్రిబ్యూటర్లు తమ వద్ద స్టాకులను పెంచుకుంటున్నారు. ఫుడ్​ ఇన్​ఫ్లేషన్​లో వంట నూనెల రేట్లు కీలకమైనవి.

మే నెలలో ఎడిబుల్​ ఆయిల్​, ఫ్యాట్​ కేటగిరీ ఇన్​ఫ్లేషన్​ 13.26 శాతంగా ఉంది. గత ఏడాది కాలంగా పెరిగిన వంట నూనెల రేట్లు ఇన్​ఫ్లేషన్​ పెరగడానికీ కారణమయ్యాయి. పామాయిల్​ రేట్లు లీటరుకు రూ. 7–8 చొప్పున, సన్​ ఫ్లవర్​ ఆయిల్​ రేట్లు లీటరుకు రూ. 10–15 చొప్పున, సోయాబీన్​ ఆయిల్​ రేట్లు లీటరుకు రూ. 5 చొప్పున తగ్గినట్లు సుధాకర రావు దేశాయ్​ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఎంఆర్​పీ (మాగ్జిమమ్​ రిటెయిల్​ ప్రైస్​)నూ తగ్గించేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు మద్దతుగా ప్రభుత్వం కోరడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త ఎంఆర్​పీతో వంట నూనె​ ప్యాకెట్లు వారం రోజుల్లో మార్కెట్​ను చేరతాయని అదానీ విల్​మార్​ మేనేజింగ్​ డైరెక్టర్​ అంగ్​షు మాలిక్​ అన్నారు. జెమిని ఎడిబుల్స్​ తన ఫ్రీడం సన్​ఫ్లవర్​ ఆయిల్​ రేటును కిందటి వారంలో లీటర్‌‌పై రూ. 15 తగ్గించింది.