- ఎడ్ సెట్ కన్వీనర్‌గా ఫిజిక్స్ ప్రొఫెసర్
- కోర్సు లేని వర్సిటీ ప్రొఫెసర్‌కు పీఈసెట్ బాధ్యతలు
- టీజీసీహెచ్ఈ తీరుపై మండిపడుతున్న ప్రొఫెసర్లు
- పీఈసెట్ నిర్వహణ తమకే ఇవ్వాలని
- శాతవాహన వర్సిటీ వీసీ లేఖ
హైదరాబాద్, వెలుగు: వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టు(సెట్స్)ల కన్వీనర్ల నియామకంపై వివాదం మొదలైంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ఎంట్రెన్స్ నిర్వహించే సబ్జెక్టుకు సంబంధం లేని ప్రొఫెసర్ కు ఓ సెట్ నిర్వహణ బాధ్యతను అప్పగిస్తే.. అసలు కోర్సు, కాలేజీయే లేని వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌కు మరో సెట్ బాధ్యత ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల ఏడు సెట్స్ నిర్వహణకు యూనివర్సిటీలను, కన్వీనర్లను నియమించారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) కోర్సులో అడ్మిషన్లకు నిర్వహించే టీజీ ఎడ్‌సెట్ కన్వీనర్‌గా కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్ వెంకటరామ్ రెడ్డిని నియమించారు. అయితే కాకతీయ వర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరు. దీంతో అక్కడి వీసీ ఫిజిక్స్ ప్రొఫెసర్ పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
రెగ్యులర్ ఫ్యాకల్టీ లేనప్పుడు ఆ సెట్ నిర్వహణను కాకతీయ వర్సిటీకి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ఎందుకు అప్పగించారని సీనియర్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారు క్వశ్చన్ పేపర్ ఎలా తయారు చేస్తారని అంటున్నారు. పీఈసెట్దీ అదే దారి.. ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) నిర్వహణ బాధ్యతలను పాలమూరు వర్సిటీకి అప్పగించారు. అయితే, జేఎన్టీయూకు చెందిన ప్రొఫెసర్ ఎన్ఎస్ దిలీప్ ను పీఈసెట్ కన్వీనర్ గా నియమించడాన్ని సీనియర్ ప్రొఫెసర్లు తప్పు పడుతున్నారు. ఆ వర్సిటీ పూర్తిగా టెక్నికల్ కోర్సులతో ఉంది.
ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ గానీ, కోర్సులు గానీ ఆ వర్సిటీలో లేవు. అయినా, జేఎన్టీయూకు చెందిన ప్రొఫెసర్‌కు కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర వస్తున్నాయి. నిర్వహణ బాధ్యతలు మాత్రం పాలమూరు వర్సిటీకి అప్పగించారు. సుమారు పది రోజుల పాటు ఫిజికల్ టెస్టులు నిర్వహించాల్సి ఉంటుందని, ఆయన ఎలా నిర్వహిస్తారని సీనియర్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా, దీనిపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమూద్ కు సీనియర్ ప్రొఫెసర్లు లక్ష్మీకాంత్ రాథోడ్, రాజేశ్ కుమార్, సునీల్ కుమార్, దీప్లా తదితరులు ఫిర్యాదు చేశారు.
ఆయన ఏ రోజూ పీఈసెట్ నిర్వహణలో ఇన్వాల్వ్ కాలేదని, ఆయనను కన్వీనర్ గా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మరోపక్క ఈ ఏడాది కూడా పీఈసెట్ నిర్వహణ బాధ్యతలను శాతవాహన వర్సిటీకి ఇవ్వాలని ఆ వర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్‌కు లేఖ రాశారు. గత రెండేండ్లు విజయవంతంగా నిర్వహించామని లేఖలో పేర్కొన్నారు.