మల్లన్న ఆలయంలో మరో వివాదం

  • ఐదేండ్ల కింద కొమురవెల్లిలో జరిగిన .. రూ. కోటి అవకతవకల ఫైళ్లు మాయం
  • గతంలో ఇక్కడ పనిచేసిన ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు
  • పది రోజుల్లో స్పందించకుంటే క్రిమినల్‌‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక
  • కొమురవెల్లికి తిరిగి వచ్చేందుకు బదిలీ అయిన ఓ ఆఫీసర్‌‌ ప్రయత్నం
  • ఆయన రాకను అడ్డుకునేందుకే నోటీసుల అంశం బయటపెట్టారని చర్చ

సిద్దిపేట, వెలుగు :ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే చర్చనీయాంశంగా మారిన కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి ఆలయంలో తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆలయంలో జరిగిన రూ. కోటి అవకతవకలకు సంబంధించిన ఐదేండ్ల కిందటి ఫైళ్లు మాయం కావడం, ఈ ఘటనపై ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 

ఐదేండ్ల కింద బయటపడ్డ అవకతవకలు

కొమురవెల్లి మల్లిఖార్జునస్వామి దేవస్థానానికి సంబంధించి 2014 నుంచి 2018 వరకు ఆదాయ వ్యయాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో లావాదేవీలపై ఆడిటింగ్‌‌ నిర్వహించేందుకు కమిషనరేట్‌‌ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కమిషనర్‌‌ ఆదేశాల మేరకు 2018లో ఆడిటర్‌‌ లక్ష్మీనారాయణ 54 అంశాలపై ఆడిటింగ్‌‌ నిర్వహించారు. 

ఎంబీ రికార్డుల్లోని మరమ్మతులు, అనుమతి లేకుండా నిర్మాణ పనులు, ఉద్యోగుల అడ్వాన్స్‌‌ చెల్లింపులకు సంబంధించిన రశీదులు, అతిథుల భోజన ఖర్చులు, వాహనాల అద్దెలు, బట్టల కొనుగోలు, మొక్కల కొనుగోలు, పెంపకం, వేలం బకాయిలతో పాటు బ్యాంక్‌‌ల నుంచి డ్రా చేసిన డబ్బులకు సంబంధించిన రిసిప్ట్‌‌లు లేవని ఆడిటింగ్‌‌లో బయటపడింది. రూ. 3 కోట్లకు సంబంధించిన పనులపై బిల్లులు లేవని గుర్తించిన ఆడిటింగ్‌‌ ఆఫీసర్లు ఉన్నతాధికారులకు రిపోర్ట్‌‌ ఇచ్చారు.

 దీని ఆధారంగా 2018 జూలైలో మొత్తం 15 మంది ఉద్యోగులకు షోకాజ్‌‌ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు స్పందించిన కొందరు ఉద్యోగులు తమ వివరణతో పాటు ఆధారాలు సమర్పించగా, మరో రూ. కోటికి సంబంధించిన అభ్యంతరాలపై సరైన ఆధారాలు చూపించలేదు. దీంతో ఆ డబ్బులను సంబంధిత ఉద్యోగుల నుంచి రివకరీ చేయాలని అప్పటి కమిషనర్‌‌ ఆదేశాలు జారీ చేసినా అవి అమలు కాలేదు.

ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు

మల్లిఖార్జునస్వామి ఆలయ ఈవో వచ్చే నెలలో పదవీ విరమణ చేయనుండడంతో ఫైళ్ల క్లియరెన్స్‌‌ పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఐదేండ్ల కింద ఆడిటింగ్‌‌ సమయంలో గుర్తించిన రూ. కోటి అభ్యంతరాలకు సంబంధించిన ఫైళ్లు కనిపించలేదు. దీంతో ఆడిటింగ్‌‌ జరిగిన సమయంలో కొమురవెల్లిలో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు.

ALSO READ : స్టాండింగ్ కమిటీ ముందుకు జీహెచ్ఎంసీ బడ్జెట్.. రూ.8,300 కోట్లతో ఫైనల్

 ఆలయ సూపరింటెండెంట్‌‌, ప్రస్తుతం కొండగట్టులో పనిచేస్తున్న నీల చంద్రశేఖర్‌‌, మేడారంలో పనిచేస్తున్న జూనియర్‌‌ అసిస్టెంట్లు వై.జగన్‌‌, నర్సింహులుకు వారం రోజుల కింద షోకాజ్‌‌ నోటీసులు ఇచ్చారు. కనిపించకుండా పోయిన ఫైళ్లను పది రోజుల్లో అందజేయడంతో పాటు, ఏం జరిగిందో వివరించాలని, లేకుంటే క్రిమినల్‌‌ చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో హెచ్చరించారు.

ఆధిపత్య పోరుతో బయటపడ్డ నోటీసుల అంశం

ముగ్గురు ఉద్యోగులకు వారం కిందే నోటీసులు జారీ అయినా బయటకు మాత్రం పొక్కలేదు. అయితే ఆలయ ఉద్యోగుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు కారణంగా ఉద్యోగుల నోటీసుల విషయం తాజాగా బయటపడింది. ప్రస్తుత ఈవో డిసెంబర్‌‌లో పదవీవిరమణ చేస్తుండడంతో ఆ స్థానంలోకి వచ్చేందుకు కొమురవెల్లి ప్రాంతానికి చెందిన ఓ సీనియర్‌‌ ఉద్యోగి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన ప్రత్యర్థి వర్గం నోటీసుల విషయాన్ని లీక్‌‌ చేసినట్లు తెలుస్తోంది. 

ALSO READ : నాగర్​కర్నూల్​ జిల్లాలో తేలిన వడ్ల లెక్క .. రూ.142 కోట్ల సీఎంఆర్​ బకాయిలు

కొమురవెల్లికి ఇన్‌‌చార్జిగానో లేక ఈవోగానో వచ్చి ఇక్కడే రిటైర్డ్‌‌ కావాలని సదరు అధికారి కమిషనరేట్‌‌లో వినతిపత్రం ఇచ్చారని సమాచారం. అయితే ఆయన కొమురవెల్లి ఇన్‌‌చార్జి ఈవోగా ఉన్న టైంలోనే ఆర్థిక లావాదేవీలపై ఆడిటింగ్‌‌ జరిగిందన్న విషయాన్ని తెరపైకి తేవడంతో పాటు ఉద్యోగులకు నోటీసులు జారీ అయిన విషయాన్ని బహిర్గతం చేస్తే, ఆయన రాకను అడ్డుకోవచ్చన్న ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా నోటీసుల అంశాన్ని బయటపెట్టినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. 

ఫైళ్ల మాయం నిజమే..

ఆడిటింగ్‌‌ అభ్యంతరాలకు సంబంధించిన కొన్ని ఫైళ్లు దొరకని విషయం వాస్తవమే. దీనిపై ఆ టైంలో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశాం. నిర్ణీత గడువులోపు స్పందించకుంటే క్రిమినల్‌‌ చర్యలు తీసుకుంటాం. 


- బాలాజీ, ఈవో, కొమురవెల్లి-