మల్లన్న తలనీలాల టెండర్లపై పీటముడి

  • తలనీలాలకు సేకరణకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
  • మూడు సార్లు వేలంపాట వాయిదా
  • కమీషనర్ నిర్ణయం కోసం ఎదురుచూపు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చే తలవెంట్రుకల సేకరణ కాంట్రాక్టు అంశం కొలిక్కిరావడంలేదు. తలనీలాల సేకరణకు ఆలయ అధికారులు ఇప్పటివరకు మూడు సార్లు వేలం నిర్వహించారు. కాంట్రాక్టర్లు గత ఏడాది కన్నా సగానికి సగం తక్కువ మొత్తానికి టెండరు దక్కించుకునేందుకు ప్రయత్నించడంతో మూడుసార్లూ వేలాన్ని వాయిదా వేశారు. రెండు నెలల కిందట ఆలయానికి సంబంధించి 12 కాంట్రాక్టుల కోసం ఆలయ అధికారులు వేలం పాట నిర్వహించారు. ఇందులో 11 అంశాలకు సంబంధించి టెండర్లు ఖరారు చేయగా.. ఒక్క తలనీలాల సేకరణ టెండరుపై మాత్రం పీటముడి పడింది. 

ఆలయానికి సంబంధించిన ప్రసాదం ప్యాకింగ్, ఫోటో వీడియోగ్రఫీ, పూలు, పూలదండలు, పాలు, పెరుగు సరఫరా, టికెట్ బుక్స్ ప్రింటింగ్, కూరగాయల సరఫరా సీల్డ్ టెండర్ల ద్వారా కేటాయించగా.. కొబ్బరికాయలు, కోరమీసాలు, ఇతర మొక్కుబడి వస్త్రాలు, ఎల్లమ్మ గుడి వద్ద ఒడిబియ్యం, వస్త్రాల అమ్మకం, ఎల్లమ గుడి వద్ద షాపుల నిర్వహణ,టాయిలెట్స్ నిర్వహణ, తలనీలాల సేకరణ కోసం బహిరంగ వేలం నిర్వహించారు. తలనీలాల సేకరణ మినహా మిగిలిన అన్ని అంశాల్లో టెండర్లు పూర్తయి, ఆలయానికి 84.51 లక్షల ఆదాయం సమకూరింది. 

మూడుసార్లు వేలంపాటలు వాయిదా

కొమురవెల్లి మల్లన్నను ఏటా దాదాపు పది లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఇందులో సగానికి పైగా భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పిస్తారు. ఆలయంవద్దనే కళ్యాణ కట్టలో భక్తులు ఉచితంగా తలనీలాలు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. భక్తులు సమర్పించిన తలనీలాల సేకరణ కోసం ఏటా వేలం వేస్తారు. గత ఏడాది తలవెంట్రుకల సేకరణ పై రూ. 86 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కూడా అంతకు మించి ఆదాయం సమకూరుతుందని అధికారులు భావించారు. రూ. 30 లక్షలు ధరావత్తు చెల్లించి కాంట్రాక్టర్లు వేలంలో పాల్గొన్నారు. అయితే ..ఈ ఏడాది మూడు సార్లు వేలం పాట నిర్వహించినా ఒక్కరు కూడా రూ. 45 లక్షలకు మించి పాడలేదు. భారీ ఆదాయం రాబట్టే ఈ టెండర్​ ఖరారు కాకపోవడంతో అధికారులు విషయాన్ని దేవాదాయ కమీషనర్ దృష్టికి తీసుకెళ్లారు. 

ధరలు తగ్గడమే కారణం....?

అంతర్జాతీయ స్థాయిలో వెంట్రుకల ధరలు తగ్గడంతోనే కాంట్రాక్టర్లు ఎక్కువ రేటు ఇచ్చేందుకు అసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కొద్ది రోజుల వరకు వెంట్రుకల సైజును బట్టి కిలో 15 వేల నుంచి 30 వేల ధర పలుకుతుండేది. కాని అంతర్జాతీయ మార్కెట్లో వెంట్రుకల ధరలు తగ్గడం వల్ల పెద్ద మొత్తానికి పాడుకుంటే నష్టపోతామని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏట కొమురవెల్లి మల్లన్న వేలంపాటల్లో తలనీలాల కాంట్రాక్ట్​కోసం కాంట్రాక్టర్లు పోటీ పడేవారు. 

కమీషనర్ నిర్ణయమే ఫైనల్

తలనీలాల కోసం ఎవరూ రూ. 45 లక్షల కన్నా ఎక్కువ రేటు ఇచ్చేందుకు సుముఖంగా లేకపోవడంతో ఏం చేయాలో తోచక అధికారులు దేవదాయ శాఖ కమీషనర్ ను ఆశ్రయించారు. హైదరాబాద్​ లోని కమిషనర్​ఆపీసులో నాలుగోసారి వేలం నిర్వహించాలని నిర్ణయించారు. పది రోజుల్లో మరోసారి వేలం జరుగుతుందని, ఈసారి కూడా ఆశించిన స్థాయిలో ఆదాయం వస్తుందాలేదా.. రాకపోతే వేలాన్ని మళ్లీ వాయిదా వేస్తారా .. ఆదాయం తగ్గినా టెండర్లు కేటాయిస్తారా అన్నది చర్చానీయాంశంగా మారింది. దేవాదాయ కమిషనర్​ ఈ విషయంలో ఫైనల్​ డిసిషన్​ తీసుకోనున్నారు.