కొత్త న్యాయదేవత చేతిలో రాజ్యాంగం

మనందరికీ న్యాయస్థానాల్లో ఉండే లేడీ జస్టిస్​ విగ్రహం తెలుసు.  ఇప్పుడు ఆ లేడీ జస్టిస్​ రూపులేఖలని  మార్చివేశారు.  అది వలసవాదుల చిహ్నంగా ఉందని  సుప్రీంకోర్టు  భావించి దాని రూపురేఖలు మార్చినారు.  కళ్లకు గంతలు కట్టి ఉండి, చేతిలో ఖడ్గాన్ని ధరించిన స్త్రీ రూపంలో ఉండే  లేడీ జస్టిస్​ రూపం ఇప్పడు మారింది.  కొత్త  విగ్రహం చేతిలో నుంచి ఖడ్గాన్ని తీసివేసి.. భారత రాజ్యాంగాన్ని ఉంచారు.  దీంతో చాలాకాలంగా ఉన్న న్యాయదేవత విగ్రహం కొత్తరూపును  దాల్చింది.  కళ్లకు గంతలు తీసివేసి,  రాజ్యాంగం  ఉంచడం వల్ల  పారదర్శకత,  జవాబుదారీతనం,  అదేవిధంగా  రాజ్యాంగ విలువలను కాపాడటంలోని నిబద్ధతని ఆ న్యాయదేవత విగ్రహం కలుగజేస్తోంది.

ఈ నవీకరించిన  విగ్రహం  వైవిధ్యమైన,  ప్రజాస్వామ్యయుత  న్యాయంకోసం  ప్రగతిశీల  దృష్టిని  కలిగి ఉందని  పలువురు న్యాయవేత్తలు అంటున్నారు.  ఈ  ఆరడుగుల న్యాయదేవత  విగ్రహాన్ని న్యాయమూర్తులు సుప్రీంకోర్టు  లైబ్రరీలో ప్రతిష్ఠించారు.  వలస పాలనలో  ఉన్న  విగ్రహాన్ని  తొలగించి  ఈ కొత్త విగ్రహాన్ని  పెట్టారు.  భారత  ప్రధాన  న్యాయమూర్తి  జస్టిస్ ​ డీవై  చంద్రచూడ్​ సూచన  మేరకు  ఈ మార్పులను  చేశారు.  వలసవాద  చట్టాల వారసత్వాన్ని వదిలి  భారతదేశం  ముందుకు  సాగాలని  ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్​ భావించారు. 

న్యాయదేవత భావన

ఈ న్యాయదేవత భావన రోమన్​ న్యాయ దేవత జస్టీసియా నుంచి ఉద్భవించింది.  ఈజిప్టియన్​ దేవత్​ ‘మాట్’ నుంచి  త్రాసుని  స్వీకరించారు. గ్రీకు దేవత థామస్​ ఒక చేతిలో ఖడ్గం,  మరో చేతిలో  న్యాయాన్ని తూచే  త్రాసు కలిగి ఉంటుంది. ఈ ఇద్దరు దేవతల నుంచి  ప్రేరణ పొంది మన న్యాయదేవతకి  త్రాసుని,  ఖడ్గాన్ని చేసి  స్వీకరించారు.  కళ్లకు గంతలు కట్టడమనేది నిష్పాక్షికతకు, నిర్భయత్వానికి చిహ్నంగా కనిపిస్తోంది.  మనదేశంలో  కొత్త  క్రిమినల్​ చట్టాలు అమల్లోకి వచ్చాయి.   భారతీయ  పేర్లతో  అవి ఉన్నాయి.  

ఈ నేపథ్యంలో  న్యాయదేవత  ఆకృతిని  మార్చాలన్న  స్ఫూర్తి  కలిగినట్టుగా  అనిపిస్తోంది.  శాంతిని  ప్రేమించే  న్యాయదేవతగా  ఉండి  రాజ్యాంగం విలువలు కాపాడాలన్న  ఉద్దేశ్యంతో  ఖడ్గాన్ని  తొలగించి  రాజ్యాంగాన్ని  న్యాయదేవత  చేతిలో  ఉంచారు.  అందరికి  సమన్యాయం  అన్న  భావనని  కలగజేసే విధంగా  భారతీయతను  ప్రతిబింబించేటట్టు  విగ్రహాన్ని రూపొందించారు. అంతేకాదు,  ప్రతీకార  న్యాయం  మాదిరిగా  న్యాయ ఉండకూడదని  ఖడ్గాన్ని  తీసివేశారు. ఈ కొత్త  న్యాయదేవత  విగ్రహం చీరని  ధరించి నిల్చున్నది. 

విమర్శలు–అభినందనలు

ఏదైనా  కొత్త పనిని  చేసినప్పుడు అభినందనలు, విమర్శలు సహజమే.  ఈ న్యాయదేవత  విగ్రహం మార్పులో  కూడా  అభినందనలు కనిపిస్తున్నాయి. విమర్శలూ  వినిపిస్తున్నాయి.  న్యాయవ్యవస్థ చేతిలో  ఓ గడియారం ఉంటే బాగుండేదని  కొందరు  విమర్శించారు.  మన న్యాయవ్యవస్థలో  జరుగుతున్న తీవ్ర  జాప్యాలను  దృష్టిలో  పెట్టుకుని  ఈ విమర్శ  చేశారు.  జాప్యాలని  తగ్గించేవిధంగా  అది సూచించేదని మరికొందరు అన్నారు.  న్యాయదేవత చేతిలో నుంచి ఖడ్గాన్ని తొలగించడం వల్ల మన న్యాయవ్యవస్థ ప్రతీకార న్యాయం అందించదన్న భావన కలగుజేస్తోందని మరి కొందరు అంటున్నారు. ఈ రెండు రకాల నేపథ్యాన్ని గమనించినప్పుడు మన న్యాయవ్యవస్థలోని లోపాల  గురించి  ఆలోచించాల్సి వస్తుంది.  మన న్యాయవ్యవస్థలో బెయిల్​ లేకుండా చాలా రోజులుగా   విచారణలో  నలిగిపోతున్న  ఖైదీలు  కనిపిస్తారు.   న్యాయం  అన్నది  ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు.  సమాజాన్నిబట్టి, కాలాన్ని బట్టి  మారుతుంది. అయితే, ఇవి ఇప్పుడు  త్వరితగతిగా  మారుతున్నట్లుగా అనిపిస్తోంది. 

న్యాయదేవత చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం

‘బెయిల్​ అనేది హక్కు. జైలు అనేది మినహాయింపు’ అనేది ఇటీవల కాలంలో చాలా మార్పులకు లోనైంది.  సుప్రీంకోర్టు బెంచీలు పరస్పర విరుద్ధ వ్యాఖ్యానాలతో జిల్లా జ్యుడీషియరినీ గందరగోళానికి గురి చేస్తున్నాయి.  న్యాయం కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న  దేశప్రజలను,  అన్యాయంగా కేసుల్లో ఇరికించబడిన వ్యక్తుల జీవితాన్ని  రక్షించాలన్నది ఈ న్యాయదేవత ఉద్దేశ్యం.  ఈ ఉద్దేశ్యాన్ని  నెరవేర్చడానికి  న్యాయమూర్తులు ఏవిధంగా పనిచేస్తారన్నది  ఇప్పడు  అందరిముందు ఉన్న ప్రశ్న.  న్యాయదేవత చేతిలో రాజ్యాంగం ఉండటమనేది ఓ మంచి ఆలోచన. 

 రాజ్యాంగ  విలువలు  న్యాయమూర్తులకి,  న్యాయవాదులకి,  కక్షిదారులకి తరచూ గుర్తుకు రావాల్సిన అవసరం ఉన్నది.  వీళ్లందరి కన్నా  ముఖ్యంగా  రాజ్యాంగ  విలువలు  గుర్తుకురావాల్సిన  వ్యక్తులు రాజకీయ నాయకులు,  పోలీసులు.   ఖడ్గాన్ని తొలగించి రాజ్యాంగం న్యాయదేవత చేతిలోకి వచ్చింది. ప్రజలకు అందించాల్సింది ప్రతీకార న్యాయం కాదు.  అదేవిధంగా  బుల్డోజర్​ న్యాయం అంతకన్నా కాదు.  ఇదే న్యాయదేవత స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని ఎంతమేర  గ్రహిస్తారో,  మరెంత మేర పాటిస్తారో ఈ ప్రశ్నకి కాలం సమాధానం చెబుతుంది. 

సత్వర న్యాయం జరగాలన్నది రాజ్యాంగ ఉద్దేశ్యం

న్యాయం సత్వరం జరగాలన్నది రాజ్యాంగ ఉద్దేశ్యం. కానీ, దాన్ని అమలుచేసే పరిస్థితి లేదు.  కారణాలు అనేకం.  కొత్త చట్టాల్లో కేసుల విచారణ పూర్తి చేయడానికి కాలపరిమితిని నిర్దేశిస్తున్నారు. కానీ, అవి అమలు జరగడం లేదు. రకరకాల కారణాల వల్ల అది జరిగే అవకాశం అంతగా కనిపించడం లేదు. ఈ మధ్య  మదన్ గోపాల్​ అగర్వాల్​ అనే వ్యక్తి  సుప్రీంకోర్టులో ఓ దరఖాస్తుని దాఖలు చేసి..  నిర్ణీత సమయంలో సుప్రీంకోర్టు,  హైకోర్టులు కేసులు పరిష్కరించేవిధంగా  ఆదేశాలు  జారీ చేయాలని  కోరాడు.  

ఆ విధంగా  కేసులను  పరిష్కరించేవిధంగా  పాశ్చాత్య  దేశాల్లో   నియమాలు ఉన్నాయని అగర్వాల్​ సుప్రీంకోర్టుకి విన్నవించాడు. ‘అది అవసరమే’ కానీ ఆ నిర్దేశించే పరిస్థితి  మన దేశంలో లేదని  ప్రధాన న్యాయమూర్తి అన్నారు.  అక్కడితో ఊరుకోలేదు.  సుప్రీంకోర్టులోని 17 బెంచీలు ఒకరోజు  పరిష్కరించే  కేసుల సంఖ్య అమెరికా సుప్రీంకోర్టు సంవత్సరం కాలంలో పరిష్కరించే కేసులకి మించి ఉంటాయని  కూడా  ప్రధాన  న్యాయమూర్తి  అన్నారు.  అది నిజమే కావొచ్చు.  కాగా, అమెరికాలో  కేసులు చాలా త్వరగా పరిష్కారం అవుతాయి.  

మనదేశంలో జరగడం లేదు.  కారణాలు ఏవైనా కావొచ్చు.  అలాంటి పరిస్థితి మనదేశంలో  ఇంకా  రాకపోతే  న్యాయదేవత  చేతిలోని  రాజ్యాంగం  అలంకార ప్రాయంగా  మిగిలిపోతుంది.  వలసవాద  చిహ్నాలే  కాదు.  వలసవాద  సంబోధనలు,  పద్ధతులు కూడా మార్చాల్సిన అవసరం ఉంది.  కేసులని పరిష్కరించడాన్ని,  శిక్షలు  వేయడాన్ని  దైవత్వ చర్యగా  తరచుగా  అకాడెమీల్లో  చెబుతుంటారు.  నిజానికి  ప్రతిపనిలో  దైవత్వం ఉన్నది.  చెప్పులు  కుట్టేవాడిలో  కూడా   దైవత్వం  ఉంది.  ఈ విషయాన్ని  అందరూ  గుర్తుపెట్టుకుంటే మంచిది. 

‘మిలార్డ్’ కూడా వలసవాద అవశేషమే

వలసవాద చిహ్నాలని మార్చడమే కాదు.  వలసవాద  సంబోధనలు  కూడా  మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఆ విధంగా  సంబోధించకపోతే  న్యాయమూర్తులు  చిన్నబుచ్చుకొని  తగిన  ఉత్తర్వులు  జారీ చేయరని చాలామంది న్యాయవాదులు అంటూ ఉంటారు.  మిలార్డ్  అనే సంబోధన కూడా బ్రిటిష్​ వలసవాద అవశేషమే.  న్యాయదేవత  కొత్త విగ్రహం, విగ్రహం కన్నా  ఎక్కువ  సమగ్రమైన  న్యాయమైన  భవిష్యత్తుకు  మార్గం  సుగమం చేయాలన్నది దాని ఉద్దేశ్యం.  

ప్రాథమిక హక్కులకి  మరింత  రక్షణని  కల్పించాలన్నది  దాని  ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.  భారతదేశం  అభివృద్ధి  చెందుతున్న దేశం.. ఈ అభివృద్ధికి  తగినట్టుగా  చిహ్నాల  మార్పులు  జరగాల్సిన అవసరం ఉంది.  న్యాయదేవత  విగ్రహంలో  ఖడ్గాన్ని తీసివేశారుకానీ  కుడిచేతిలో  తరాజుని  అట్లాగే ఉంచారు.   రెండువైపులా  వాదనలు  విని  నిష్పక్షపాతంగా  కోర్టులు  తీర్పులు  చెప్పాలన్నది దీని  ఉద్దేశ్యం.  ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం చెబుతున్నది ఇదే. 

- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్​)