నైతికత పాటిస్తేనే.. రాజ్యాంగానికి గౌరవం

మనదేశంలో అప్పుడు అమలులో ఉన్న గవర్నమెంట్​ ఆఫ్​ ఇండియా యాక్ట్​ 1935ని తొలగిస్తూ కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఓ అసెంబ్లీ ఆఫ్​ పీపుల్​ను ఏర్పాటు చేశారు. ఆ విధంగా రాజ్యాంగ రచన కోసం అసెంబ్లీ ఏర్పాటైంది. దాని మొదటి సమావేశం 9 డిసెంబర్​ 1946న జరిగింది. డా. ఎస్. రాజేంద్రప్రసాద్​ని ఆ అసెంబ్లీకి అధ్యక్షునిగా, అదేవిధంగా హెచ్​సీ ముఖర్జీని ఉపాధ్యక్షునిగా నియమించారు. ఆ తరువాత 29 ఆగస్టు 1947న రాజ్యాంగ రచన కోసం (డ్రాఫ్టింగ్​ కమిటీ)  డా. బీఆర్​ అంబేద్కర్​ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. మున్షీ ఎన్​ గోపాలస్వామి అయ్యన్నార్, చైతాన్, మిట్టర్,  మహమ్మద్​ సదుల్లా, క్రిష్ణస్వామి అయ్యర్​లను సభ్యులుగా నియమించారు. అంబేద్కర్​ అధ్యక్షతన ఏర్పడిన ఓ కమిటీ ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ముసాయిదా భారత రాజ్యాంగాన్ని తయారు చేసింది. రాజ్యాంగ అసెంబ్లీ దాన్ని 26 నవంబర్​ 1949న ఆమోదించింది.

మన భారత రాజ్యాంగం 26 జనవరి 1950 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ కారణంగా భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం 26 నవంబర్​ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. డా. అంబేద్కర్​ను రాజ్యాంగ నిర్మాతగా తలచుకుంటున్నాం. ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడానికి కారణం రాజ్యాంగ విలువలను  దేశ పౌరులకు ఒకసారి గుర్తు చేయడం దాని ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగ నిర్మాతల కృషిని గుర్తించి, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలన్నది దాని ప్రధాన లక్ష్యం. 

ఆశ్చర్యం కలిగించే విషయాలు

మొదటి రాజ్యాంగ ప్రతిని పూర్తిగా చేతితో రాశారు. రాజ్యాంగ ప్రతి సరిహద్దులను కళాఖండాలతో  ప్రతిపేజీని అలంకరించిన వ్యక్తి నందలాల్​ బోస్. కాలీగ్రఫీ రాత నిపుణుడు ప్రేమ్​ బిహారీ నారాయణ్​ రైజ్​దా ఒక్కడే రాజ్యాంగం మొత్తాన్ని తన చేతితో రాశాడు. ఈ పనిని పూర్తి చేయడానికి ఆయనకు ఆరుమాసాల సమయం పట్టింది. ఈ పని చేసినందుకు ఆయన ఒక్క పైసా కూడా తీసుకోలేదు. రాజ్యాంగ రాత ప్రతి 16 ఇంటు 22 అంగుళాలు కొలిచే   షీట్​లపై  రాశారు.  దీని జీవిత కాలం వెయ్యి సంవత్సరాలు ఉంటుందని ఒక అంచనా. రాజ్యాంగ మొత్తం బరువు 3.75 కిలోలు. ఈ రాజ్యాంగం తయారుచేయడానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది.  ఈ రాజ్యాంగ అసెంబ్లీలో ప్రొవిన్షియల్​ లెజిస్లేటివ్ అసెంబ్లీల నుంచి 299 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. డ్రాఫ్టింగ్​ కమిటీతో సహా మొత్తం 13 కమిటీలు ఉన్నాయి. 

రాజ్యాంగ నైతికతను పాటిస్తున్నారా..

రాజ్యాంగం అమల్లోకివచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. రాజ్యాంగ నైతికతని రాజ్యాంగ అధినేతలు పాటిస్తున్నారా అన్నది అసలు ప్రశ్న. రాజ్యాంగ నైతికత అనేది ఒక భావన. ప్రభుత్వానికి, పౌరులకి చర్చలకు రాజ్యాంగ సూత్రాల ప్రకారం మార్గనిర్దేశం చేసే భావన అది. ఈ భావనని బ్రిటిష్ క్లాసిసిస్ట్​ జార్జీ గ్రోట్​ 19వ శతాబ్దంలో మొదటిసారిగా ప్రతిపాదించారు. రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలకి అత్యంతం గౌరవం ఇచ్చే భావన అని ఆయన అభివర్ణించారు. మనదేశంలో ఈ పదాన్ని మొదటిసారిగా బీఆర్​ అంబేద్కర్​ వాడినారు. 

రాజ్యాంగ నైతికతకు మూల స్తంభాలు

న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, వ్యక్తి గౌరవం లాంటివి రాజ్యాంగ విలువలు. ప్రభుత్వ అధికారులతో సహా అందరూ చట్టానికి లోబడి పనిచేయాలి. బాధ్యత వహించాలి. ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రాథమిక హక్కులను గౌరవించాలి. అధికార విభజనను సమతుల్యతలను పాటించాలి. మారుతున్న  సామాజిక​అవసరాలకి, పరిస్థితులకి అనుగుణంగా రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించాలి. పాలనలో నైతిక  ప్రవర్తన పారదర్శకత జవాబుదారీతనం ఉండాలి. అలాంటి పరిస్థితి దేశంలో కొరవడినట్టు అనిపిస్తున్నది.   ఇటీవల కాలంలో రాజ్యాంగ నైతికతను పక్కన పెట్టినట్టు అనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణలుగా బుల్డోజర్​ న్యాయంతోపాటు ఎన్నో సంఘటనలను మనం చెప్పవచ్చు. మహారాష్ట్ర శాసన మండలికి సభ్యులను నామినేట్​ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్​కి సూచించింది. కొన్ని నెలల వరకు గవర్నర్​ ఎలాంటి చర్యలు ఆ సిఫారసు మీద తీసుకోలేదు. ఆ సిఫారసులను ఆయన తిరస్కరించవచ్చు. ఆమోదించవచ్చు. ఆ సలహాను పక్కనపెట్టాడు. దీంతో బాంబే హైకోర్టులో ప్రజాహిత కేసు దాఖలైంది. ఆ కేసును పరిష్కరించే సమయంలో హైకోర్టు పబ్లిక్​లో ప్రకటన చేసింది. రాజ్యాంగం ప్రకారం సహేతుకమైన సమయంలో గవర్నర్​ ఆ సిఫారసులను ఆమోదించడం కానీ తిరిగి పంపడం కానీ చేయాలి. 8 నెలల సమయం అనేది సహేతుకమైన సమయం కాదు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి అవసరమైన జాప్యం లేకుండా తమ విధులను నిర్వర్తించాలని సూచించింది. అయినా గవర్నర్​ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆ తరువాత ఆ ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వం వేర్వేరు సిఫారసులను చూసింది. వాటిని గవర్నర్​ వెంటనే ఆమోదించారు. రాజ్యాంగ నైతికత అనేది చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది.  

ALSO READ : అప్లై చేస్తున్నరు.. ఎగ్జామ్ రాస్తలేరు!

రాజ్యాంగ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వలేదు

రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఆలస్యం చేసిన గవర్నర్లు ఎందరో,  నెలల తరబడి, సంవత్సరాల తరబడి తమ ఆమోదాలను తెలపని గవర్నర్​లు కూడా ఉన్నారు. అటువంటి విషయాలలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గవర్నరులే కాదు స్పీకర్​ కూడా రాజ్యాంగ నైతికతకు ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్​లోని ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సభ్యులపై మూడు సంవత్సరాలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ సభ్యుల్లో ఒకరు కేబినెట్​ మంత్రి కూడా. స్పీకర్​ అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా ఉంటారని అంటారు. ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. అంతేకాదు ఆయన మంత్రికి అనుకూలంగా వ్యవహరించారు. చివరికి ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. నెలలోగా చర్యలు తీసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ, స్పీకర్​ నెలలోగా చర్యలు తీసుకోలేదు. మరింత సమయం కోర్టుని అడిగారు. నిర్దిష్ట కాలంలో చర్యలు తీసుకుంటాను అని  సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తరువాత కూడా ఆ కాల పరిమితిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఆ మంత్రిని సభలోకి రానివ్వకుండా కోర్టు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. 

చట్టాలను గౌరవిస్తేనే.. 

జైలులో  పెట్టినప్పటికీ పశ్చిమబెంగాల్​లో  ఒక మంత్రి  పదవిలో కొనసాగాడు. అతడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలగించలేదు. మూడు మాసాల తరువాత తొలగించారు. 8 నెలలు జైల్లోఉన్న మంత్రిని తమిళనాడు ముఖ్యమంత్రి తొలగించలేదు. మద్రాస్​ హైకోర్టులో చర్చ జరగడానికి ముందు ఆ మంత్రి రాజీనామా చేశాడు.  9 నెలలు జైలులో ఉన్న తరువాత ఢిల్లీలో ఓ మంత్రిని ముఖ్యమంత్రి తొలగించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్లారు. బెయిలు మీద విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించిన తరువాత ఆయన రాజీనామా చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే రాజ్యాంగ నైతికతను విస్మరించిన సంఘటనలు చాలా మనకు కనిపిస్తాయి. రాజ్యాంగ అధినేతలు రాజ్యాంగ నైతికతను పాటిస్తేనే రాజ్యాంగానికి గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుంది. మన రాజ్యాంగాన్ని,  స్ఫూర్తిని, చట్టాలను అందరూ గౌరవించాలి. అప్పడే మన రాజ్యాంగ రోజుకి సార్థకత.


- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్​)