అన్నీ తానై కుటుంబానికి అండగా ..కానిస్టేబుల్ గంగమణి జీవితం ఎందరికో ఆదర్శం

ఆమె ఓ పేదింటి మహిళ. తల్లి దండ్రులు చిన్నప్పుడే ఆమెకు పెండ్లి చేశారు. కానీ..  ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయింది. పిల్లలతో పుట్టింటికి వచ్చేసింది. భర్తకు దూరమై పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆమెకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కానిస్టేబుల్​గా పనిచేసే తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దాంతో కుటుంబ భారం ఆమెపైనే పడింది. అయినా..కుటుంబానికి అండగా నిలవాలని నిశ్చయించుకుంది. పట్టుదలతో కానిస్టేబుల్ ​ఉద్యోగం సాధించింది. ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత కూడా తానే తీసుకుని చదివించింది. వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాక పెండ్లిళ్లు చేసింది. మరో వైపు తన కూతురు, కొడుకును కూడా ప్రయోజకులను చేసింది. ఇప్పుడు కొడుకు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్​, కూతురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. ఇలా.. అన్నీ తానై తోడబుట్టిన చెల్లెళ్లు, కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసింది గంగమణి.

 తిమ్మన్నగారి శ్రీధర్, మెదక్, వెలుగు

సంగారెడ్డి జిల్లా బీబీపేట గ్రామానికి చెందిన నారాయణ, మల్లమ్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి గంగమణికి ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే పెండ్లి చేశారు. కానీ.. తండ్రిని చూస్తూ పెరిగిన గంగమణి మాత్రం బాగా చదువుకుని పోలీస్​ కావాలని కలలు కనేది. అందుకే పెండ్లి తర్వాత కూడా చదువుకోవడం ఆపలేదు. అంతలోనే ఆమెకు కూతురు, కొడుకు పుట్టారు. తర్వాత భర్తతో విడిపోయి తల్లి గారింటికి చేరింది. ఆ తర్వాత కొంతకాలానికి  మెదక్​లో హెడ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న నారాయణ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ‘ఓ వైపు పెండ్లి చేసి పంపిన కూతురు ఇంటికి వచ్చేసింది. మరోవైపు ఇంటి పెద్ద దిక్కు కాలం చేసిండు’ అని నారాయణ భార్య మల్లమ్మ రోజూ బాధపడేది.

పెద్ద కూతురు బాగోగులు చూసుకుంటూ.. మిగిలిన ఇద్దరు ఆడపిల్లల పెండ్లిళ్లు చేయడం ఎలా? అని ఆవేదన చెందేది. పైగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నో  కష్టాలు పడాల్సి వచ్చింది. కుటుంబ పోషణ భారంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో పెద్ద కూతురు గంగమణి కుటుంబానికి అండగా నిలబడాలని నిశ్చయించుకుంది. పట్టుదలతో కష్టపడి చదివి 2014లో పోలీస్ కానిస్టేబుల్​గా ఉద్యోగం సాధించింది. కుటుంబ బాధ్యతలను భుజాల మీద వేసుకొని, అన్నీ తానై ఇంటిని చూసుకుంది. ఇద్దరు చెల్లెళ్లను బీటెక్ వరకు చదివించింది. ఇద్దరూ పంచాయితీ సెక్రటరీలుగా ఉద్యోగాలు సాధించారు. వాళ్లకు కూడా  తనే పెండ్లిళ్లు చేసింది.

పోలీసుల సాయం

గంగమణి  మీద కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో తన కొడుకు  నవీన్ చంద్ర, కూతురు శ్రీజను చదివించడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. అయినా.. బాల్య వివాహం వల్ల తన జీవితం నాశనం అయ్యిందని తనలా తన పిల్లలు ఇబ్బందులు పడొద్దని కష్టాలను పంటికింద దాచుకుని పిల్లలిద్దరినీ చదివించింది. ఆ టైంలో గంగమణి కుటుంబ పరిస్థితి చూసి పోలీస్ డిపార్ట్​మెంట్ వాళ్లు కూడా కొంత సాయం చేశారు.

బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన గంగమణి కొడుకు నవీన్ చంద్ర ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే గంగమణి గైడెన్స్​ వల్ల ఫిజికల్ టెస్ట్​ల్లో,  ఆ తర్వాత రిటన్​ ఎగ్జామ్స్​లో క్వాలిఫై అయ్యి మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగం సాధించాడు. ఇంటర్మీడియట్ చదివిన కూతురు శ్రీజ కూడా తొలి ప్రయత్నంలోనే పోలీస్ కానిస్టేబుల్​గా సెలెక్ట్​ అయ్యింది. ప్రస్తుతం గంగమణి చేగుంట పోలీస్​ స్టేషన్​లో విధులు నిర్వర్తిస్తుండగా, నవీన్ చంద్ర కామారెడ్డి జిల్లా బాన్స్​వాడలో ప్రొబిషనరీ ఎస్సైగా పనిచేస్తున్నాడు. శ్రీజ  మెదక్​ రూరల్​ పోలీస్​ స్టేషన్​ లో పనిచేస్తోంది. 

క్రెడిట్​ మా అమ్మదే

నేను ఎస్సైగా సెలెక్ట్​ కావడంలో క్రెడిట్​ అంతా మా అమ్మదే. నాకు చాలా సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. నా కంటే ఎక్కువ అమ్మే కష్టపడింది. డిగ్రీ చదువుతున్నప్పటినుంచే జాబ్​ మీద ఫోకస్​ పెట్టాను. సొంతగానే బుక్స్​ తెచ్చుకుని చదువుకున్నా.  జాబ్​ సాధించేందుకు కోచింగ్​ తప్పనిసరి కాదు. నేను రెండు నెలలు కోచింగ్​ తీసుకున్నా  అది పెద్దగా ఉపయోగపడలేదు. సెల్ఫ్​ స్టడీ వల్లే జాబ్​ సాధించగలిగా. 

- కొడుకు నవీన్​ చంద్ర, ఎస్సై 

ఫస్ట్​ అటెంప్ట్​ లోనే

ఈ జాబ్​ వస్తదని నేను ఎక్స్​పెక్ట్​ చేయలేదు. నాకు తెలియకుండానే అమ్మ అప్లై చేసింది. అమ్మ సూచనలు, సలహాలతో ప్రిపేర్​ అయ్యి ప్రిలిమ్స్​, ఈవెంట్స్​, మెయిన్స్​ క్వాలిఫై అయ్యా. ఫస్ట్​ అటెంప్ట్​లోనే సెలెక్ట్ అయ్యా. చిన్న ఏజ్​లో జాబ్​ వచ్చినందుకు నాతో పాటు అమ్మ, అన్న ఫుల్​ హ్యాపీ.ఫ్యూచర్​లో గ్రూప్స్​కు ప్రిపేర్​ అయ్యి ఉన్నత ఉద్యోగం సాధించాలన్నది నా టార్గెట్.​ 

- కూతురు శ్రీజ, కానిస్టేబుల్​

చాలా గర్వంగా ఉంది

పోలీస్​ కావాలన్నది నా కల. పట్టుదలతో సాధన చేసి కానిస్టేబుల్​ ఉద్యోగం సాధించిన. నా కుటుంబాన్ని బాగా చూసుకోగలిగిన. నా  పిల్లలు పోలీస్​ డిపార్ట్​మెంట్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. చదువు, ఉద్యోగాల విషయంలో వాళ్లకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్​ పెట్టలేదు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించాలని మాత్రమే చెప్పిన. కరోనా టైంలో చదువుకుందుకు టైం దొరికింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని  ఉద్యోగాలకు ప్రిపేర్​ అయ్యారు. నా ఇద్దరు పిల్లలు ఫస్ట్​ అటెంప్ట్​లో పోలీస్​ ఉద్యోగాలు సాధించడం చాలా హ్యాపీగా ఉంది.  కొడుకు ఎస్సైగా సెలెక్ట్​  అయినందుకు గర్వంగా ఫీలవుతున్నా.ఏ మహిళ తక్కువ కాదు, వాళ్ల సామర్థ్యం వాళ్లకు తెలియదు. కష్టపడితే ఏదైనా సాధించ వచ్చు. 

- గంగమణి, కానిస్టేబుల్​