- ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడితో నష్టపోయిన బాలకృష్ణ
- అప్పులు పెరగడంతో సిద్దిపేటలో సూసైడ్
సిద్దిపేట, వెలుగు: అప్పులు ఎక్కువ కావడంతో ఓ కానిస్టేబుల్తన భార్యాపిల్లలతో కలిసి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతనికి.. కొన్ని గంటల తర్వాత స్పృహ రావడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య, ఇద్దరు కొడుకులు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ పొందుతున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34) సిరిసిల్లలోని 17వ పోలీస్ బెటాలియన్ లో కానిస్టేబుల్. ఇతడు సిద్దిపేటలోని కాళ్లకుంట కాలనీలో కుటుంబంతో సహా ఉంటున్నాడు. శనివారం రాత్రి 11 గంటలకు డ్యూటీ ముగించుకొని బాలకృష్ణ ఇంటికి వచ్చాడు. అయితే అతడు ఆందోళనగా ఉండడంతో ఏమైందని భార్య మానస అడిగింది. అప్పు చేసి ఫినిక్స్ మిల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీలో రూ. 25 లక్షలు పెట్టుబడి పెట్టానని, కానీ అది నష్టాల్లోకి వెళ్లిందని బాలకృష్ణ బాధపడ్డాడు. ‘‘పెట్టుబడి కోసం అప్పులు తెచ్చాను. ఇప్పుడు వాళ్లంతా ఇంటి మీదికి వచ్చి గొడవ చేయకముందే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మంచిది. నువ్వు వెళ్లి టీ తీసుకురా’’ అని భార్యకు చెప్పాడు. ఆమె టీ తెచ్చాక అప్పటికే తన వెంట తెచ్చుకున్న ఎలుకల మందును అందులో కలిపాడు. భార్యతో పాటు కొడుకులు యశ్వంత్, అశ్విత్ కు తాగించాడు. తర్వాత తానూ తాగాడు. దీంతో వాళ్లంతా అపస్మార స్థితిలోకి వెళ్లారు.
స్పృహ రావడంతో..
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బాలకృష్ణకు స్పృహ వచ్చింది. భార్యతో పాటు పిల్లలు బతికే ఉన్నారని అతడు గమనించాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న భార్య చీరను తీసుకొని వేరే గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. గమనించిన భార్య మానస.. తన మరిది సాయి, తమ్ముడు శ్రీశైలానికి ఫోన్ చేసి చెప్పింది. వాళ్లు అక్కడికి వచ్చి డోర్ పగులకొట్టి బాలకృష్ణను కిందికి దించారు. అతనితో పాటు మానస, పిల్లలను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కానీ అప్పటికే బాలకృష్ణ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మానస, ఇద్దరు పిల్లలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు.