పోలీస్ ఠాణా ప్రాంగణంలో ఉరేసుకుని.. హెడ్ కానిస్టేబుల్ సూసైడ్​

  • కొందరు తన భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టి బ్లాక్ మెయిల్ చేశారని సాయికుమార్​ భార్య ఆరోపణ
  • మెదక్ జిల్లా కొల్చారంలో ఘటన 

మెదక్/కొల్చారం, వెలుగు: కొందరు తనకు వివాహేతర సంబంధం అంటగట్టి, డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఓహెడ్​కానిస్టేబుల్​ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారంలో జరిగింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన కాటూరి సాయికుమార్ (55) 1992లో పోలీసు శాఖలో కానిస్టేబుల్​గా చేరారు. జోగిపేటకు చెందిన లక్ష్మీని పెండ్లి చేసుకుని, నర్సాపూర్ లో ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా, వాళ్లిద్దరికీ లగ్గాలు అయ్యాయి. 

Also Read :- రైతు భరోసాకు ఆన్​లైన్​ అప్లికేషన్లు!

ఇంతకుముందు కౌడిపల్లిలో పని చేసిన సాయికుమార్​ఏడాదిన్నర కింద ట్రాన్స్​ఫర్​పై మెదక్ జిల్లా కొల్చారం పోలీస్​స్టేషన్​కు వచ్చారు. ఇక్కడ హెడ్​కానిస్టేబుల్​గా పని చేస్తున్నారు. ఆదివారం ఉదయం వాకింగ్ కు వెళ్లి వచ్చిన తర్వాత కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి మాట్లాడిన సాయికుమార్.. ఆ తర్వాత స్టేషన్ ప్రాంగణంలోనే ఎస్ఐ క్వార్టర్ పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకొని సూసైడ్​చేసుకున్నారు. 

కొందరు బ్లాక్ మెయిల్ చేశారని భార్య ఆరోపణ

నర్సాపూర్ కు చెందిన కొందరు తన భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టి వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని భార్య శైలజ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నర్సాపూర్ లోని ఓ టిఫిన్ సెంటర్ కు నా భర్త తరచూ వెళ్లేవారు. ఈ క్రమంలో ఆ హోటల్ నిర్వాహకురాలితో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేవారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆమెతో నా భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టారు. హోటల్ నిర్వాహకురాలి భర్త, అల్లుడు వేధింపులకు గురిచేశారు. 

డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసు పెడతామని బెదిరించారు. పరువు తీస్తామని, చంపుతామని బెదిరించడంతో నా భర్త కుమిలిపోయాడు. వారి వేధింపులు తట్టుకోలేక చనిపోతానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. నా భర్త చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి” అని ఫిర్యాదులో శైలజ పేర్కొన్నారు. దీనిపై కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.