లగచర్ల ఘటన వెనుక కుట్ర ఉంటే.. అది తెలంగాణకే ప్రమాదం

వికారాబాద్​ జిల్లా లగచర్లలో ‘ఫార్మా ఇండస్ట్రియల్​ కారిడార్​’ పై అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్​పై, ఇతర అధికారులపై జరిగిన దాడి చూస్తే..  తెలంగాణ బ్లేమ్​గేమ్​ రాజకీయాలు ఎంత వేగంగా పరుగులు తీస్తున్నాయో అర్థమవుతుంది.  ప్రజలు కలెక్టర్​కు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం ఉండింది. తమ భూములను ఎట్టి పరిస్థితిలో ఇవ్వబోమని చేప్పే అధికారం ఉంది. ఫార్మా కంపెనీలతో పెరిగే  పొల్యూషన్​పై  అభ్యంతరం చెప్పే హక్కు ఉంది.  కానీ, లగచర్లలో అదేమీ జరగలేదు. అందుకు విరుద్ధంగా కలెక్టర్​పై దాడి జరగడమే అనేక అనుమానాలకు తావిచ్చింది. 

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. అక్కడి ప్రజలను కొందరు రెచ్చగొట్టి దాడి చేయించారని తేలింది. ప్రతిపక్షానికి చెందిన ఓ వ్యక్తే రెచ్చగొట్టారని వార్త. చాలామందిని అరెస్టు చేశారు. ప్రతిపక్షానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అరెస్టు కూడా జరిగింది.  వేళ్లన్నీ  బీఆర్​ఎస్ యజమానుల​ వైపే చూపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. ప్రజల తరఫున పోరాడాల్సిన  ప్రతిపక్షం, ప్రజల జీవితాలతో ఆడుకోవడం దురదృష్టకర పరిణామం. గత పదేండ్ల కాలంలో ధర్నాలు, నిరసనలకు అనుమతులివ్వనివారే, ఇయ్యాల ధర్నాలు, నిరసనల స్వేచ్ఛను అనుభవిస్తూ ‘లగచర్ల’ ను నడిపించి ఉంటే.. వాళ్లు సిగ్గుపడాల్సిందే!

అధికార పక్షం కుట్రలు, కుతంత్రాలతో.. ప్రతిపక్షాన్ని బలహీనపర్చడం లేదా ప్రతిపక్షాన్ని లేకుండా చేయడమనేది గత పదేండ్ల  తెలంగాణ రాజకీయాల్లో  చూస్తూవచ్చాం. కానీ, అప్పటి అధికార పక్షం (బీఆర్ఎస్​) ఇపుడు ప్రతిపక్షంగా మారాక అడ్డదారి రాజకీయాలను, బ్లేమ్​గేమ్​లను నడుపుతుండటమే  గత 11 నెలలుగా చూస్తూ వస్తున్నాం. ఇది చిన్న విషయమేమీ కాదు. ఇప్పటికీ అది అధికార పక్షంగానే  ఫీలవుతూ రాజకీయాలను నడుపుతుండటమే ఇక్కడ ఆసక్తికర విషయం. తన ఒరవడిలోగానీ, బాడీ లాంగ్వేజ్​లోగానీ​ ఏమాత్రం మార్పులేదు.  ఇదంతా..  అధికారం చేపట్టిన పార్టీ(కాంగ్రెస్​) బలహీనతగా అర్థం చేసుకోవల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

పవర్​ పోయింది, మనీ పవర్​ పోలే

‘అభివృద్ధి’కి పర్యాయ పదం ‘కమీషన్లు’ అనేది తెలంగాణలో  పదేండ్ల నుంచి నానుడి అయింది .  అందుకే సంపద పోగయ్యాక అధికారం ఉన్నా, లేకున్నా పెద్ద తేడా పడదు. పవర్​ పోయింది తప్ప మనీ పవర్​ పోలేదని జరుగుతున్న అడ్డదారి రాజకీయాలే చెబుతున్నాయి.  పదేండ్లలో అన్ని వ్యవస్థలను వశపర్చుకున్న అనుభవం  మరింత పెద్దది. ఆ అనుభవం ఇపుడు ప్రతిపక్షంగా మారాక కూడా ఉపయోగపడుతున్నదేమో!   పదేండ్లలో ఏడు లక్షల కోట్ల అప్పులు, అప్రయోజనకర ఆస్తులు తప్ప ప్రజల జీవితాల్లో ఎదుగుదల ఎక్కడా కనిపించకపోవడం అందుకు ప్రబల సాక్ష్యం! 

కాళేశ్వరం, భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్లాంట్లు వంటివన్నీ గుదిబండలుగా  ఎందుకు మారాయి?  తెలంగాణ బతికినంతకాలం వాటన్నిటి  బరువును  మోయాల్సిందే! అవి కామధేనువులు కాదు,  గుదిబండలని ఇప్పటికే  తేలిపోయిందంటే.. పదేండ్లలో అవినీతి హద్దులు దాటి జరిగిందనడానికి  ఇంకా ఏ సాక్ష్యం కావాలనేది ఇరిగేషన్​, పవర్​ ఎక్స్​పర్ట్స్​ అభిప్రాయం. పదేండ్లలో ఇంత అనర్థం చేసినవారు.. పవర్​ పోయినా, మనీ పవర్​తో ప్రతిపక్ష పాత్రలోనూ అడ్డదారి రాజకీయాన్ని నడపగలుగుతున్నారనేది బుద్ధిజీవుల అభిప్రాయం. 

నైతికతలే సిగ్గుపడుతున్నాయి 

పదకొండు నెలల్లో ప్రతిపక్షంగా బీఆర్ఎస్​ కనీస నైతికతలను కూడా కాపాడుకోలేకపోయింది. తమ పాలనలో జరిగిన అనర్థాలపైనే, ఇపుడు మాట్లాడుతుండటం, సంబంధిత ప్రజలను రెచ్చగొడుతుండటం విచిత్రమైన సన్నివేశాలను చూడాల్సిన పరిస్థితి. సర్పంచ్​ల పెండింగ్​ బిల్లులు వెంటనే చెల్లించాలని కేటీఆర్​ మాట్లాడం, హరీశ్​రావు ధర్నా చేయడం చూసి ఆ సర్పంచ్​లే నవ్వుకొని ఉంటారు. బిల్లులు చెల్లించని గత పాలకుడే, ఇపుడు ఆ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసే  ఇలాంటి దుస్థితి బహుశా  దేశంలో  ఏ ప్రతిపక్షానికి కూడా వచ్చి ఉండదు. 

గత పదేండ్లలో ప్రభుత్వం బిల్లులు చెల్లించనందున, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న  సర్పంచ్​ల వార్తలు అనేకం చూశాం. అప్పటి పాలకులే ఇప్పుడు ప్రతిపక్షంగా,  ప్రభుత్వాన్ని డిమాండ్​ చేయడం చూసేవారికి ఎంత అనైతికంగా కనిపిస్తుందో చెప్పనక్కరలేదు.  ‘హంతకుడే సంతాపం తెలిపినట్లు’ సర్పంచ్​ ల  పేర స్పాన్సర్డ్​ ధర్నాలకు  దిగజారడం  జుగుప్సాకరం.  కులగణనను వ్యతిరేకిస్తున్న  తీరు మరో విషాదం. పదేండ్లలో  బీసీల రిజర్వేషన్లను 24 శాతానికే పరిమితం  చేసినవారు, ఇపుడు హామీల అమలు పేరుతో కులగణనను వ్యతిరేకించాలని పిలుపునివ్వడం ఖచ్చితంగా బరితెగింపు వ్యవహారమే. పదేండ్ల పాపాలను నెత్తిన మోస్తూ.. అధికార పక్షాన్ని ఏ విషయంలో నిలదీసినా బీఆర్​ఎస్​   యజమానులను ‘అనైతికత’ వెంటాడుతూ వస్తుండటం చూస్తే.. ప్రతిపక్ష హోదాకు కూడా వారు అర్హులు కాలేకపోతున్న పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. 

బలహీనతా? అసమర్థతా?

చట్టవిరుద్ధంగా ఈ- కార్​ రేసుకు సంబంధించి రూ.50 కోట్లు ఓ అధికారి అప్పటి మంత్రి కేటీఆర్​ అనుమతితోనే ఇచ్చానని చెప్పి నెలలు గడిచాయి. కానీ, ఈ మధ్య మాత్రమే దానిపై ప్రభుత్వం స్పందించింది. ఆ కేసులో కేటీఆర్​ను విచారంచేందుకు  గవర్నర్​ అనుమతి కోరినట్లు, అది ఇంకా గవర్నర్​ దగ్గరే ఉన్నట్లు మొన్న  స్వయంగా సీఎం చెప్పారు. అక్రమంగా నిధులను విడుదల చేసిన అధికారిపైగానీ, కేటీఆర్​పై గానీ చర్యలు తీసుకోవలసిన కేసుకు కొన్ని నెలలు పట్టడమే ప్రభుత్వానికి ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్న.  ఇవి ప్రభుత్వ బలహీనతను లేదా అసమర్థతను తెలియజేస్తాయి. 

ఈ- రేస్​ కు  బరాబర్​ పైసలిచ్చామని, తానే సంతకం పెట్టా అని కేటీఆర్​ చేసిన బహిరంగ సవాల్​ నిజంగా కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఒక  ఛాలెంజే. వీటన్నిటినీ అధికార పార్టీ బలహీనతగా  భావించడం వల్లే, ప్రతిపక్షం (బీఆర్ఎస్​) అడ్డదారి రాజకీయాలకు, బ్లేమ్​గేమ్​లకు, స్పాన్సర్​ ధర్నాలకు అలవాటు పడిపోతున్నదని  ఎందుకు అనుకోకూడదు అనేదే బుద్ధిజీవుల ప్రశ్న.  కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమైతే, మళ్లీ బీఆర్ఎస్​  కాలం ఎక్కడొస్తదో అనే భయం ప్రజల్లో ఉందంటే..లగచర్లలో జరిగిన కుట్ర తెలంగాణకు ఎంత ప్రమాదకరమైనదో  గమనించాల్సిన విషయం.పదేండ్ల పాలనాకాలంలో  బలోపేతం చేసుకున్న  ఆర్థిక మూలాలతోనే ప్రతిపక్ష బీఆర్ఎస్​ బ్లేమ్​గేమ్​లను, స్పాన్సర్ పోరాటాలను​ దిగ్విజయంగా నడుపుకోగలుగుతున్నదనేది సర్వవ్యాప్తిలో ఉంది. దాని ఆర్థిక మూలాలను వదిలేసి, ప్రెస్​మీట్​ రాజకీయాలతో  ఎదుర్కోలేమనే విషయాన్ని  అధికార కాంగ్రెస్​ పార్టీ గుర్తించకపోతే.. మరో నాలుగేండ్ల పాటు లగచర్ల వంటి సంఘటనలు పునరావృతం  కాకుండా అడ్డుకోవడం అధికారపార్టీకి అసాధ్యమైన పనే.

దర్యాప్తుల భయమేది? 

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం చేపట్టగానే, గత ప్రభుత్వ నిర్వాకాలపై శ్వేతపత్రాలు (వైట్​ పేపర్స్) విడుదల చేసింది. దాంతో పాటు కాళేశ్వరంపై జ్యుడీషియల్​ కమిషన్​ వేసింది. విద్యుత్​ కొనుగోళ్లు, నిర్మించిన విద్యుత్​ ప్లాంట్లపై కూడా కమిషన్​ వేసింది. కానీ, దర్యాప్తులు ఎప్పటికి పూర్తవుతాయో,  అక్రమాలు ఎప్పుడు వెలుగు చూస్తాయో, దోషులకు శిక్షల సంగతెలా ఉంటుందో అంతుపట్టని విషయమే.  సుమారు 3 లక్షల కోట్ల  ప్రజాధనానికి సంబంధించిన దర్యాపులవి.  కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ దర్యాప్తుల ద్వారా అక్రమాలను వెలికి తీసి, జరిగిన అవినీతిని రికవరీ చేయాలనేదే ప్రజలు ఆశించేది. దర్యాప్తులతో అధికార పార్టీలు పొలిటికల్​ మైలేజీకే పరిమితమవుతాయనే అనుభవాలు.. అనుమానాలకు తావివ్వడం సహజం. ఇదంతా కాంగ్రెస్​ ప్రభుత్వ నిజాయితీపై ఆధారపడే అంశం మాత్రమే.

అధికారం పోగానే..

అధికార పక్షం తప్పిదాలను నిలదీయడం ప్రతిపక్షం బాధ్యతే. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ సకారాత్మక బాధ్యత కన్నా, నకారాత్మకతనే మా బాధ్యత అన్నట్లుగా అడ్డదారి రాజకీయాలను ఆశ్రయిస్తున్న తీరే జుగుప్సాకరంగా కనిపిస్తున్నది. ప్రతిపక్షం చేస్తున్న రాజకీయ తంత్రాలే అధికారపక్ష సమర్థతను ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.  అధికారం పోగానే పదేండ్ల  అహంకారం కోరలు చాస్తున్నది. తంత్రం, కుతంత్రం, బ్లేమ్​గేమ్​లను మాత్రమే అది ఆశ్రయిస్తున్నది. ఇది తెలంగాణ రాజకీయాలకే ప్రమాదకరం.

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి, పొలిటికల్​ ఎనలిస్ట్​-