ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్​రెడ్డి

మహబూబ్​నగర్​/వనపర్తి/కొత్తకోట, వెలుగు: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘మేం అధికారంలోకి వచ్చి 150 రోజులు కాలేదు. కాకులు, గద్దల్లాగా నువ్వు దిగిపో అంటున్నరు. నీ కడుపులో పొడుస్తం.. వీపులో పొడుస్తం.. అని కత్తులు తీసుకొని కొందరు బయల్దేరిన్రు. ఢిల్లీ నుంచి ఇంకొందరు భుజాల మీద గొడ్డళ్లు వేసుకొని వస్తున్నరు. పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దా?” అని ఆయన ప్రశ్నించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో శనివారం సాయంత్రం మహబూబ్​నగర్​  కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్​షో, కార్నర్​ మీటింగ్​లో సీఎం మాట్లాడారు. ‘‘రేవంత్​ రెడ్డి తన మీద పగబట్టిండని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అంటున్నది. ఆమెకు నాకు ఎలాంటి గెట్టు, పాలి పంచాది లేదు. అలాంటప్పుడు ఆమె మీద నాకేం పగ? పాలమూరు బిడ్డ ఇప్పుడు రాష్ట్రంలో సీఎంగా ఉన్నడు. 

పాలమూరు బిడ్డగా ఇక్కడి వలసలు ఆపాలని, ఎడారిగా మారిన పొలాలకు సాగునీరు అందించాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలని ప్రయత్నిస్తున్న. కానీ.. నన్ను దించాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని డీకే అరుణ ప్రయత్నిస్తున్నది” అని ఆయన మండిపడ్డారు. ‘‘కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుంది. ఈ కుట్రలను బయటపెట్టినందుకు నాపై ఢిల్లీలో కేసు పెట్టిన్రు. నన్ను అరెస్టు చేసి తీసుకుపోవాలని ఢిల్లీ నుంచి పోలీసులను రప్పించిన్రు. ఇది న్యాయమా? డీకే అరుణను మనం గెలిపించాలా?” అని ప్రశ్నించారు. ‘‘పాలమూరు జిల్లా మీద కక్ష పెట్టుకున్నరు. పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చినా.. శత్రు పంచన చేరి మనల్ని దెబ్బతీయాలని కొందరు చూస్తున్నరు” అని ఆయన మండిపడ్డారు. 

రాష్ట్రానికి మోదీ ఇచ్చిందేంది?

ప్రధాని మోదీ రాష్ట్రానికి అమాస, పున్నానికి చుట్టం లాగా వచ్చి వెళ్తుంటారని.. పదేండ్లు ప్రధానిగా ఉన్నా ఆయన 'పాలమూరు' స్కీముకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గద్వాలకు చెందిన డీకే అరుణ ఇక్కడ ఎక్కువగా ఉన్న  బోయల సమస్యల గురించి ప్రధానితో ఎందుకు మాట్లాడలే అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్​ రెడ్డి, మహబూబ్​నగర్​ జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణ సుధాకర్​ రెడ్డి, మహబూబ్​నగర్​ లోకల్​ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్​ రెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రె డ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీని ఓడించాలి

సికింద్రాబాద్/ముషీరాబాద్, వెలుగు: మోదీ సర్కారు రాష్ట్రానికి గాడిద గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. అందుకే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు. శనివారం సికింద్రాబాద్ ఎంపీ​ అభ్యర్థి దానం నాగేందర్​తో కలిసి సీఎం రేవంత్ రోడ్​ షో నిర్వహించారు. సీతాఫల్​మండి చౌరస్తాలో మాట్లాడారు. ‘‘గోదావరి నుంచి జలాలను రప్పించి జంట నగరాలకు మంచినీటిని అందించింది కాంగ్రెస్ పార్టీనే. నగరానికి మెట్రో రైల్​ తెచ్చింది.. ఫ్లై ఓవర్లు కట్టించింది.. ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం కట్టించింది.. హైదరాబాద్​లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్​ పార్టీనే.  చివరికి కేటీఆర్​ అప్పుడప్పుడు సెల్ఫీలు తీసుకునే శిల్పారామం కూడా అప్పట్లో కాంగ్రెస్​ ప్రభుత్వమే కట్టించింది. కాంగ్రెస్​ చేసిన అభివృద్ధిని తామే చేసినట్లు బీఆర్​ఎస్​, బీజేపీ చెప్పుకోవడం సిగ్గు చేటు” అని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్​కుమార్​ యాదవ్​, గ్రేటర్​ డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలత, రాజ్యసభ సభ్యుడు అనిల్​ కుమార్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.