వయనాడ్ వరదలు: హెలికాఫ్టర్లతో కాపాడినందుకు 132 కోట్లు కట్టాలా.. బాబ్బాబు కొంచెం తగ్గించుకోండి

ఇటీవల కేరళలో కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.. వందలాది ఇండ్లు తుడిచిపెట్టుకుపోయాయి..గ్రామాలు గ్రామాల్లో కనిపించకుండా పోయాయి. ఇప్పటికీ కొండచరియల విధ్వంసం నుంచి ఆ గ్రామాల ప్రజలు కోలుకోలేదు. మరోపక్క కేరళ ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది.. విపత్త సమయంలో కేంద్ర మిలిటరీ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే..అయితే ఎయిర్ లిఫ్టు ఛార్జీలను మినహాయించాలని కేరళ ప్రభుత్వం హైకోర్టును అభ్యర్థించింది. దీంతో కేంద్రానికి కేరళ హైకోర్టు కీలక సూచనలు చేసింది.  

కేంద్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు కీలక సూచనలు చేసింది. కేరళలోని విపత్తుల సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లకోసం ఎయిర్ లిఫ్ట్ ఛార్జీలుగా డిమాండ్ చేసిన రూ. 132 కోట్లు నుంచి రూ. 120 కోట్లు మానవతా దృక్పథంతో మినహాయించాలని కేరళ హైకోర్టు బుధవారం (డిసెంబర్ 18) న కేంద్రానికి సూచించింది. 

రూ. 120 కోట్లు మినహాయిస్తే వయనాడ్ లోని కొండ చరియల బాధితులకు పునరావాసం కల్పించేందుకు కేటాయించవచ్చని జస్టిస్ ఏకే జయశంకరన్ నంబియార్ , ఈశ్వరన్ ఎస్ లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది. జనవరి 10, 2025 నాటికి ఈ అంశంపై  స్పందించాలని తెలిపింది. 

2006 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించిన రూ.132కోట్ల బిల్లు కేరళ ప్రభుత్వం బకాయి పడింది.ముఖ్యంగా వయనాడ్ జిల్లాలో మూడు గ్రామాల్లో  కొండచరియలు విరిగిపడి జరిగిన విధ్వంసం సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీవ్రంగా శ్రమించి బాధితులకు సహాయం అందించింది. 

అక్టోబర్ 22, 2024 నాటికి ఎయిర్ లిఫ్ట్ ఛార్జీ లసెటిల్ మెంట్ కు సంబంధించి కేరళ ప్రభుత్వానికి కేంద్రం బిల్లుల వివరాలు పంపించింది. 2018లో వరదల సమయంలో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లకు సంబంధించిన బకాయిలు రూ.100కోట్లు, జూలై లో వయనాడ్ జిల్లాలో కొండచరియిలు విరిగిపడి  విధ్వంసం సృష్టించిన సమయంలో రెస్క్యూకోసం రూ. 13కోట్ల బిల్లులు ఉన్నాయి. 

కేరళ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) ఖాతాలో ప్రస్తుతం రూ. 61 కోట్లనిధులు ఉన్నాయి. రూ.120 కోట్లు విడుదల చేస్తే వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన బాధితులకు పునరావాసం కల్పించేందుకు తక్షణ సాయం రూ.180 కోట్లు అందుతుందని కోర్టు స్పష్టం చేసింది.