కాంగ్రెస్‌‌‌‌ ఖాతాలోకి పాలమూరు డీసీసీబీ

  • చైర్మన్‌‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పాన్‌‌‌‌గల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ విష్ణువర్ధన్‌‌‌‌రెడ్డి

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పదవి కాంగ్రెస్‌‌‌‌ ఖాతాలో చేరింది. వనపర్తి జిల్లా పాన్‌‌‌‌గల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌‌‌‌రెడ్డి చైర్మన్‌‌‌‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో చైర్మన్‌‌‌‌గా ఎన్నికైన నిజాంపాషా అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చైర్మన్‌‌‌‌ ఎన్నికకు ఈ నెల 19న నోటిఫికేషన్‌‌‌‌ విడుదల అయింది.

ఎన్నికల అధికారి టైలస్‌‌‌‌పాల్‌‌‌‌ శుక్రవారం ఉదయం స్థానిక డీసీసీబీ ఆఫీస్‌‌‌‌లో చైర్మన్‌‌‌‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 15 మంది డైరెక్టర్లు ఉండగా కాంగ్రెస్‌‌‌‌ బలపరిచిన వనపర్తి జిల్లా పాన్‌‌‌‌గల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌‌‌‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌‌‌‌ వేశారు. దీంతో అతడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించి, నియామకపత్రం అందజేశారు.

పారదర్శకంగా పనిచేస్తాం

మహబూబాబ్‌‌‌‌నగర్‌‌‌‌ డీసీసీబీ బ్యాంక్‌‌‌‌ పరిధిలోని రైతులకు న్యాయం చేసేలా పారదర్శకంగా పనిచేస్తామని కొత్తగా ఎన్నికైన చైర్మన్‌‌‌‌ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌‌‌‌రెడ్డి చెప్పారు. నియామకపత్రం అందుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. బ్యాంక్‌‌‌‌ నష్టపోవద్దనే ఉద్దేశంతోనే నిజాంపాషా తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

చైర్మన్‌‌‌‌గా అభ్యర్థిగా ప్రకటించిన సీఎం రేవంత్‌‌‌‌రెడ్డికి, సహకరించిన ఎక్సైజ్‌‌‌‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌‌‌‌కర్నుల్‌‌‌‌ ఎంపీ మల్లు రవితో పాటు తనకు మద్దతు నిలిచిన డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, జనంపల్లి అనిరుథ్‌‌‌‌రెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్‌‌‌‌రెడ్డి, పర్ణికారెడ్డి, మేఘారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ కోరమోని వెంకటయ్య పాల్గొన్నారు.