డిసెంబర్ 16న జీహెచ్ఎంసీ ఎన్నికలపై కాంగ్రెస్ మీటింగ్

  • హైదరాబాద్ నేతలతో చర్చించనున్న మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఈ నెల16 సోమవారం గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. శనివారం హైదరాబాద్ లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ పరిధిలోని డివిజన్ల వారిగా పార్టీ కమిటీలు, ప్రజా పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంపై, పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు ఇవ్వడంపై ఇందులో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్  కూడా హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీటింగ్​లో గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా పాల్గొంటారని తెలిపారు.