కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలకు అన్యాయం

  •   బీజేపీకి ఈసారి 400 ఎంపీ సీట్లు రాలే.. 
  •   240కే పరిమితమైంది: ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి
  •   అందుకే చంద్రబాబు, నితీశ్​తో బేరాలు చేస్తున్నది..
  •   ఏపీ, బిహార్ ​రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు
  •   బడ్జెట్​లో తెలంగాణ పేరు కూడా ఎత్తలేదని విమర్శ

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ సర్వైవల్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీజేపీకి ఈ సారి నాలుగు వందల సీట్లు రాలేదని.. కేవలం 240 సీట్లకే పరిమితమైందని (చార్ సౌ నహీ హువా... దో సౌ చాలీస్ హువా) అన్నారు. దీని ప్రభావం 18వ లోక్ సభ బడ్జెట్ పై స్పష్టంగా కనిపించిందన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్​లో కేవలం ఏపీ, బిహార్ గురించి మాత్రమే ప్రస్తావించారని ఆరోపించారు. మూడోసారి అధికారంలోకి వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారని.. కానీ రాజకీయంగా బతకడానికి జేడీయూ చీఫ్​నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్​చంద్రబాబుతో బేరాలు చేస్తున్నారని విమర్శించారు. 

తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల్లో జరిగిన నష్టాన్ని గురువారం లోక్ సభలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎండగట్టారు. పార్లమెంట్ లో అడుగుపెట్టినప్పుడు తాను.. పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం అని నమ్మానని, ఇందులో ప్రతి రాష్ట్రానికి, ప్రతి సభ్యుడికి సమాన అవకాశాలు వస్తాయని భావించినట్లు చెప్పారు. కానీ ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీ సర్వైవ్ అయ్యేందుకు పాకులాడుతోందని దుయ్యబట్టారు. ఇందులో భాగానే.. ఏపీ, బిహార్ రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. అయితే తామేమి ఏపీ, బిహార్​కు వ్యతిరేకం కాదని, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలని కోరుకుంటామన్నారు. 

అందుకే బీఆర్ఎస్​ను పార్లమెంట్ బయటే ఉంచారు..

గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీలు పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలిపారని చామల ఆరోపించారు. కేంద్రం తెచ్చిన నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. అనేక బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను మాత్రం విస్మరించిందని.. అందుకే ప్రజలు ఆ పార్టీని పార్లమెంట్ బయటే ఉంచారని చెప్పారు. బడ్జెట్​లో ఏపీకి సబ్ స్టాన్షియల్ ఫండ్స్ కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించడంతోపాటు అమరావతి కోసం రూ. 15,000 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారన్నారు. అయితే కనీసం తెలంగాణ పేరును కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించలేదని చెప్పారు. 

మోదీ సర్కార్ ప్రవేశ పెట్టిన 10 బడ్జెట్లలో తెలంగాణను ఎప్పుడూ చిన్నచూపు చూశారని వివరించారు. బడ్జెట్ లో పోలవరం గురించి కేంద్ర మంత్రి మాట్లాడారే తప్ప.. తెలంగాణలో 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ‘‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం’’ గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, వెనకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపులో విస్మరించారని మండిపడ్డారు.

బీజేపీ ఎంపీలు స్పందిచడం లేదు

సీఎం రేవంత్ రెడ్డి మూడు సార్లు ప్రధాని మోదీని.. 18 మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారని చామల చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కలిసి రావాలని రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలను కోరితే... వారు స్పందించడంలేదని మండిపడ్డారు.