ఇయ్యల (డిసెంబర్ 26న) కర్నాటకలో సీడబ్ల్యూసీ మీటింగ్

  • అటెండ్ కానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ గురువారం కర్నాటకలోని బెల్గాంలో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ మీటింగ్ కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితోపాటు ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేతలంతా గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి బెల్గాం వెళ్లనున్నారు. ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, ఇతర సీడబ్ల్యూసీ సభ్యులు హాజరుకానున్నారు. 

ఇందులో తెలంగాణకు చెందిన అంశాలేమీ ప్రత్యేకంగా  చర్చకు రాకపోవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జాతీయ స్థాయిలో ఎన్డీయే సర్కార్ పై కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా పోరాడే అంశం, త్వరలో జరగనున్న మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ సాగనుందని గాంధీ భవన్ వర్గాలు  చెప్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చకు ఏమాత్రం అవకాశం ఉండదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.