అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్​ దేశవ్యాప్త ఆందోళన : కేసీ వేణుగోపాల్​

  • నేటి నుంచి వారంపాటు నిరసన: కేసీ వేణుగోపాల్​ 

న్యూఢిల్లీ, వెలుగు: అంబేద్కర్​పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి వారంపాటు వివిధ రూపాల్లో నిరసన తెలుపాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. “మనుస్మృతి ఆరాధకులకు వ్యతిరేకంగా బీఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని రక్షించడానికి మేం పోరాడతాం . 

ఈ దిశలో కాంగ్రెస్ పార్టీ రాబోయే వారాన్ని డాక్టర్ అంబేద్కర్ సమ్మాన్ సప్తాహ్‌‌గా నిర్వహించబోతున్నది’ అని వెల్లడించారు.  ఆది, సోమవారాల్లో కాంగ్రెస్ ఎంపీలు, సీడబ్ల్యూసీ మెంబర్లు, సీనియర్ పార్టీ లీడర్లు దేశవ్యాప్తంగా 150  ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. 

ఈ నెల 24 న దేశవ్యాప్తంగా అంబేద్కర్​ సమ్మాన్ మార్చ్ నిర్వహించి, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి వినితిపత్రాలు సమర్పించనున్నట్టు వెల్లడించారు. 26–27వ తేదీల్లో బెలగావిలో సీడబ్ల్యూసీ సెషన్, మెగా ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కాగా, అమిత్​షా కామెంట్లను ఖండిస్తూ ఈ 24న దేశవ్యాప్త ఆందోళనకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పిలుపునిచ్చింది.