148 రోజుల పాటు రాహుల్ యాత్ర

148 రోజుల పాటు రాహుల్ యాత్ర

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత్ జోడో’ యాత్ర అక్టోబరు 2 న ప్రారంభమవుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ ప్రకటించారు. ఈ యాత్ర 148 రోజుల పాటు  కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల మేర జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు 25 కిలోమీటర్ల పాదయాత్ర  కొనసాగుతుందన్నారు. దాదాపు 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా యాత్ర జరుగుతుందని తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇవాళ జరిగిన అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ పదాధికారుల సమావేశంలో ‘భారత్ జాగో’ యాత్ర విధివిధానాలపై  చర్చించినట్లు దిగ్విజయ్ చెప్పారు.  గత ఎనిమిది సంవత్సరాల బీజేపీ పరిపాలనలోని వైఫల్యాలు, ప్రజాస్వామ్యంపై దాడి, రాజ్యాంగ సంస్థలను వ్యక్తులపై ఉసిగొల్పడం, అధిక ధరలు, నిరుద్యోగం,  రైతుల సమస్యలు ప్రధాన ఎజెండాగా యాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

పీసీసీల సన్నద్ధత తర్వాతే తేదీపై ప్రకటన.. 

రాష్ట్రాల పీసీసీల సన్నద్ధత తర్వాత.. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనే దానిపై ప్రకటన చేస్తామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అక్కడి పీసీసీల రాష్ట్ర నాయకులు చేపట్టిన యాత్రలు కూడా ఇందులోకి చేరుతాయని పేర్కొన్నారు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని, జాతిపిత హత్యకు దారితీసిన వారి సిద్ధాంతాల వల్లే నేడు ద్వేషపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో ‘భారత్ జోడో’ యాత్రను దేశవ్యాప్త ఉద్యమంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో చేసిన నవ సంకల్పం లో భాగంగానే భారత్ జోడో యాత్ర ను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.