ఎవుసానికి కాంగ్రెస్ భరోసా..రైతు సంక్షేమమే ధ్యేయం

నూతన సంవత్సరం తొలివారంలోనే శుభవార్త విన్న తెలంగాణ రైతన్నలకు పది రోజులు ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చ డంలో ఎల్లప్పుడూ ముందుండే కాంగ్రెస్ అన్నదాతలకు మరింత భరోసా కల్పిస్తూ ‘రైతు భరోసా’ను ప్రకటించి మాది రైతు ప్రభుత్వం అని మరోసారి నిరూపించు కుంది. 

రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ‘రైతు రుణమాఫీ’  ‘వరికి బోనస్’ పథకాలను అమలుచేసిన కాంగ్రెస్ ఇప్పుడు ‘రైతు భరోసా’తో తమది  రైతు పక్షపాత ప్రభుత్వమని సగర్వంగా చెప్పుకుంది.  

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రైతుల ఇబ్బందులను గమనించి వారి కన్నీటిని తుడవడమే లక్ష్యంగా 2022 మే నెలలో వరంగల్​లో పార్టీ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పలు సంక్షేమాలతో కూడిన రైతు డిక్లరేషన్ ప్రకటించింది. 

దేశాభివృద్ధిలో రైతులది కీలక పాత్ర అని,  వారందరూ సిరిసంపదలతో ఆనందంగా ఉంటేనే సమాజంలో  సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని విశ్వసించే కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ‘వరంగల్ డిక్లరేషన్’కు అనుగుణంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతిస్తూ రాష్ట్ర బడ్జెట్లో 35 శాతం వ్యవసాయానికి  కేటాయించింది.

 వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్లో  72 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులను కేటాయించింది. అన్నదాతలను ఆదుకోవడంలో మొదటి మెట్టుగా ‘రైతు రుణమాఫీ’ అనంతరం ‘వరికి బోనస్’ ఇచ్చి ఇప్పుడు ‘రైతు భరోసా’ ప్రకటించి కాంగ్రెస్ అంటే రైతులు, రైతులు అంటే కాంగ్రెస్ అని మరోసారి నిరూపించుకుంది రేవంత్ రెడ్డి సర్కార్.

రాష్ట్ర రైతుల్లో వ్యవసాయంపై భరోసా కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.12వేలు అందించేలా ‘రైతు భరోసా’ ప్రకటించడంపై అన్ని వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.  నిజమైన  రైతులకే  మేలు జరిగేలా ప్రభుత్వం విధివిధానాలను రూపొందించింది.  గత  బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన ‘రైతుబంధు’ పథకం ప్రధానంగా ఆ పార్టీలోని  రాబందులకే ఉపయోగపడింది.

గత ప్రభుత్వ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ యోగ్యమైన భూములకే  రైతు భరోసా అందించాలని నిర్ణయించడం స్వాగతించాల్సిన అంశం.

కేసీఆర్  హయాంలో  బీఆర్ఎస్ బడా నేతలకు చెందిన రాళ్లు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు, రోడ్లకు పోయే భూములకు, కబ్జా భూములకు, మైనింగ్ చేస్తున్న భూములకు ఇలా వ్యవసాయ యోగ్యం కాని భూములకు అక్రమంగా ‘రైతుబంధు’ అందించి ప్రభుత్వ  ఖజానాను కొల్లగొట్టారు. దీనికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం పంట పండించే భూములకే  ‘రైతు భరోసా’ ప్రకటించడంతో నిజమైన అన్నదాతలకే  న్యాయం జరుగుతుంది.

రుణమాఫీతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

‘రైతు భరోసా’తో  భూములున్న యజమానులకే ప్రయోజనం కలుగుతుందని,  వీరితోపాటు వ్యవసాయ భూముల్లో పనిచేసే రైతు కూలీలకు కూడా సమన్యాయం జరిగేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 

భూమిలేని  రైతు కూలీల  కుటుంబాలను కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో  ‘వరంగల్ డిక్లరేషన్’లో  ప్రకటించినట్టు  ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరున  ఏటా రూ.12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్  ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులందరికీ న్యాయం చేసినట్టయ్యింది.  

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ కూలీల ఆవేదనను అర్థం చేసుకొని, అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకునేలా చర్యలు తీసుకొని మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పదేళ్ల బీఆర్ఎస్ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతులకిచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

కేసీఆర్​ చేసిన అప్పులకే ఆదాయం చెల్లు

రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణ పదేళ్ల తర్వాత రూ.7 లక్షల కోట్ల అప్పులపాలైంది.  కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకే ప్రతి నెల రూ.6500 కోట్ల అసలు, మిత్తీ చెల్లించాల్సిన క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లోనూ రైతులు సంతోషంగా ఉంటేనే  రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని విశ్వసించే కాంగ్రెస్ అందుకు అనుగుణంగా పాలిస్తోంది. 

ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేయడమే లక్ష్యంగా, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేయడంతో రాష్ట్ర రైతాంగానికి ప్రయోజనం కలగడంతో,  దేశంలోనే చరిత్ర సృష్టించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.

రికార్డు స్థాయిలో సన్నాల సాగు

అన్నదాతలను అన్నివిధాల ఆదుకోవడమే లక్ష్యంగా వరికి బోనస్ అందించి వారిని ప్రోత్సహించడంతో రాష్ట్రంలో వరి సాగు బాగా పెరిగింది.  ప్రతి క్వింటాల్ సన్న వడ్లకు  రూ.500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో వర్షాకాలంలో సన్నాల సాగు 60 శాతం పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇవ్వడంతో భవిష్యత్తులో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో సన్నాల సాగు పెరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. 

ఇది కౌలు రైతులకు కూడా ప్రయోజనకరంగా మారింది. రాష్ట్రంలో వరి ధాన్య కొనుగోలు కోసం రికార్డు స్థాయిలో సీజన్లో 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో రైతులకు వరి పంట లాభాలను తెచ్చిపెట్టింది.  

వరి మాత్రమే కాకుండా తెలంగాణలో  పండే అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రైతులకు నష్టం కలగకుండా చేసింది.  

రైతులను ఆదుకోవడమే లక్ష్యం

రాష్ట్రం నుంచి 8 మంది బీజీపీ ఎంపీలు,  ఇద్దరు కేంద్ర మంత్రులున్నా వారు రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేలేకపోవడం 
దురదృష్టకరం. 

అంతేకాక రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా తోడ్పాటు అందిస్తూ వ్యవసాయ భూములు కోల్పోయి త్యాగం చేస్తున్న రైతులను  మెరుగైన విధానంలో ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆ భూముల మార్కెట్ విలువను మూడింతలు పెంచుతూ రాష్ట్ర రైతులను ఆర్థికంగా పరిపుష్టం చేసింది.

రాష్ట్రంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవాలనే లక్ష్యంగా ముందుకుసాగుతున్న కాంగ్రెస్ 

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్యమైన ఆరోపణలు చేస్తున్నాయి. రుణమాఫీ,  బోనస్​పై  ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై  రైతుల నుంచి సానుకూలమైన  స్పందన రాకపోవడంతో చతికిలపడ్డ  ప్రతిపక్షాలు ఇప్పుడు  రైతు భరోసాను  విమర్శిస్తున్నాయి. 

కాంగ్రెస్  ప్రభుత్వం రూ.12 వేలే  ఇస్తుందని  ఆరోపిస్తున్నాయి.  బీఆర్ఎస్  హయాంలో  వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని  భూములకు  రైతుబంధు కింద రూ.22 వేల కోట్లకు పైగా చెల్లించి దుర్వినియోగం చేశారు.  వారి పాలనలో బడా నేతలు,  పారిశ్రామికవేత్తలు,  వ్యాపారస్తులు విమానాల్లో వచ్చి రైతుబంధు చెక్కులు తీసుకున్నారు.   

గడీల పాలనకు భిన్నంగా ప్రజాపాలన

రైతుబంధులో అక్రమాలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ మాట తప్పిందని  రైతు భరోసాపై  బీఆర్ఎస్​ ఆరోపణలు చేస్తుంటే  దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది.   నిధులు,  నియామకాలు,  నీళ్లు  నినాదంతో  అధికారంలోకి వచ్చిన  బీఆర్ఎస్  వాటికి తిలోదకాలిస్తూ గడీల పాలన చేసింది.  దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్  తానే  సీఎం కుర్చీలో  కూర్చొని రాష్ట్రంలో కుటుంబపాలన చేశారు.   ఇంటింటికీ 
ఉద్యోగం అని చెప్పి తన కుటుంబంలోని  నలుగురికి  రాజకీయ ఉద్యోగాలిచ్చుకున్నారు.  దళితబంధును నామమాత్రం చేశారు.  వచ్చిన ఏడాదిలోనే  కాంగ్రెస్  ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేస్తుండడంతో  తట్టుకోలేని  ప్రతిపక్షాలు  బురదజల్లే  కార్యక్రమాలను ఆపకపోతే  ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.

రైతు బీమా 

రాష్ట్రం కోనుగోలు చేసిన పంటల్లో కేంద్ర ప్రభుత్వం 25 శాతమే తీసుకుంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక ఇబ్బందులు కలగకూడదనే సంకల్పంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని రకాల పంటలను సేకరిస్తోంది.  రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్  ప్రభుత్వం రూ.1,514 కోట్ల రైతు బీమాను పూర్తిచేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.  రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే,  రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని తమ రైతులకు పంట నష్టం చెల్లించి ఆదుకుంది. 

- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు