కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సంసద్ టీవీ షో నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలో ఇటీవల 12 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసింది. అయితే వారికి మద్దతు తెలుపుతూ... శశిథరూర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తేసే వరకు తాను సంసద్ టీవీ షోకు హాజరు కానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సంసద్ టీవీలో ‘టు ది పాయింట్’ అనే చర్చా వేదికకు శశి థరూర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎంపీలపై వేటు ఎత్తివేసే వరకూ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోనని స్పష్టం చేశారు. అంతకుముందు శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది కూడా సంసద్ టీవీ యాంకర్‌గా తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే రాజ్యసభలో విపక్షాలకు షాక్ తగిలింది. పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్ తగిలిన విషయం తెలిసిందే. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన 12 మంది ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద సస్పెన్షన్ విధించారు. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒకరు ఉన్నారు.
