బీజేపీ వస్తే దేశానికే ప్రమాదం: రంజిత్​రెడ్డి

వికారాబాద్, వెలుగు: మతం, ఆలయాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి విమర్శించారు. లోక్​సభ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు కీలకమని చెప్పారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఏకాంబరి ఆలయంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్​రెడ్డితో కలిసి రంజిత్​రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మైల్వార్, దామర్ చెడ్, బషీరాబాద్, నవాల్గ, గొట్టిగ కుర్థు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ సమగ్రతకు విఘాతం కలిగించిందని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. 

బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందన్నారు. కాంగ్రెస్​పార్టీ తెలంగాణలో 14 ఎంపీ స్థానాల్లో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీగా పని చేసి సమయంలో చేవెళ్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని చెప్పారు. తాను చేసిన పనులను బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డి చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని, పదేళ్ల గ్యారంటీతో ప్రత్యేక హోదా, పేద కుటుంబంలోని మహిళకు సంవత్సరానికి రూ.లక్ష ఆర్థిక సాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్‌‌‌‌ అందిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. 

నవాబుపేటలో కాంగ్రెస్ ఆఫీస్ ​ఓపెన్

నవాబుపేట మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆఫీసును చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్​చార్జ్ పామేన భీమ్ భరత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో మాదిరిగా దేశంలోనూ కాంగ్రెస్​విజయ కేతనం ఎగరవేస్తుందన్నారు. పార్టీ శ్రేణులు సైనికులుగా పని చేసి రంజిత్​రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పీసీబీ మెంబర్ సత్యనారాయణరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.