అల్లు అర్జున్, డైరెక్టర్​పై చర్యలు తీసుకోండి

  • మేడిపల్లి పోలీసులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
  • కొన్ని సీన్లు పోలీసులను అవమానించేలా ఉన్నాయని ఫైర్​

మేడిపల్లి, వెలుగు: పుష్ప–2 హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్​పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్​లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో పోలీసులను అవమానించేలా కొన్ని సీన్లు ఉన్నాయని, ఓ సన్నివేశంలో పోలీసు అధికారిని స్విమ్మింగ్ పూల్ లో పడేసి హీరో అల్లు అర్జున్ అందులో మూత్రం పోస్తాడని చెప్పారు. ఇది పోలీసుల మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఇలాంటి సన్నివేశాలను తొలగించాలని డిమాండ్​చేశారు. 

స్మగ్లర్లు, నేరగాళ్లను హీరోలుగా చూపెట్టే సినిమాలకు సెన్సార్ బోర్డు, పోలీస్ డిపార్ట్​మెంట్, ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. స్మగ్లింగ్ ను ఆపడానికి ప్రయత్నించిన పోలీసులను విలన్లుగా ఎలా చూపిస్తారని మల్లన్న ప్రశ్నించారు. ఇది పోలీసులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందన్నారు. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్​పై ఫిర్యాదు అందిందని, విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి వెల్లడించారు.